సాక్షి, విశాఖపట్నం : డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(డీసీఐఎల్) ఎండీ, సీఈవోగా కెప్టెన్ దివాకర్ మరోసారి బాధ్యతలు స్వీకరించారు. డైరెక్టర్ల బోర్డు, రెమ్యునరేషన్ కమిటీ ఇటీవల సమావేశమై.. ఈ బాధ్యతలను దివాకర్‌కు అప్పగిస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో.. డీసీఐ కార్పొరేట్ కార్యాలయంలో ఆయన బాధ్యతల్ని బుధవారం స్వీకరించారు. 1987లో డీసీఐలో డ్రెడ్జింగ్ కేడర్‌లో ఏఐడీసీ–వీ బ్యాచ్ కేడెట్‌గా ఉద్యోగ ప్రస్థానం ప్రారంభించిన ఆయన అంచెలంచెలుగా ఎదుగుతూ మాస్టర్ ఆఫ్ డ్రెడ్జర్‌గా నిలిచారు. ఏడేళ్ల పాటు మాస్టర్‌గా విధులు నిర్వర్తించారు. అత్యాధునిక డ్రెడ్జర్లకు నాయకత్వం వహిస్తూ అనేక డ్రెడ్జింగ్ ప్రాజెక్టుల్ని విజయవంతంగా పూర్తి చేశారు. డీసీఐలో ఉన్న ఒడిదొడుకుల్ని సరిచేస్తూ.. సంస్థను అగ్రపథాన నడిపించడమే ప్రధాన లక్ష్యంగా నిర్దేశించుకున్నానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. డీసీఐ అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది ఆయనకు అభినందనలు తెలిపారు.


