నగరంలో 120 కొత్త కెమెరాలు ప్రారంభం
అల్లిపురం: నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిమితుల్లో నేరపూరిత ప్రాంతాలు, నేరాలు జరిగే అవకాశం ఉన్న ప్రదేశాలను గుర్తించి, అక్కడ జెమినీ ఎడిబుల్స్–ఫ్యాట్స్ వారి సహకారంతో 120 సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. గురువారం నగర పోలీస్ కమిషనరేట్ సమావేశ మందిరంలో దాతలతో కలిసి నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి వీటిని ప్రారంభించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. నగరంలోని వన్‌టౌన్, టూటౌన్, త్రీటౌన్, ఫోర్త్ టౌన్, మహారాణిపేట, కంచరపాలెం, ఎయిర్‌పోర్టు పోలీస్ స్టేషన్ల పరిధిలో నేరం జరిగిన తర్వాత నేరస్తులు తప్పించుకునేందుకు అవకాశం ఉన్న సుమారు 250 ప్రాంతాలను గుర్తించామని తెలిపారు. అందులో మొదటి దశగా 44 ప్రాంతాల్లో 120 సీసీ కెమెరాలను సీఎస్సార్ నిధులతో ఏర్పాటు చేసినట్లు వెల్లించారు. నూనె బ్రాండ్ ‘ఫ్రీడ మ్’ తయారీదారులైన జెమినీ ఎడిబుల్స్–ఫ్యాట్స్ వారు ఈ కెమెరాల ఏర్పాటుకు సహకరించారని వివరించారు. ఈ కెమెరాలను కమాండ్ కంట్రోల్ రూమ్‌కు అనుసంధానం చేసి నిరంతరం పర్యవేక్షించనున్నట్లు పేర్కొన్నారు. తాను 2024 జూన్ 1వ తేదీన పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నగరవ్యాప్తంగా మొత్తం 13,485 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. సహకరించిన జెమినీ ఎడిబుల్స్ ప్రతినిధులను సీపీ సత్కరించారు.


