మద్దిలపాలెం: ఐక్యత, వైవిధ్యమే మన బలం అని, వసుధైక కుటుంబానికి ఆంధ్ర విశ్వవిద్యాలయం నిదర్శనంగా నిలుస్తోందని అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ అన్నారు. ఏయూ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా బీచ్‌రోడ్డులోని కన్వెన్షన్ సెంటర్ వేదికగా గురువారం నిర్వహించిన అంతర్జాతీయ విద్యార్థుల సాంస్కృతిక విభావరిని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఏయూ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొనడం తనకు ఎంతో ఆనందాన్ని ఇస్తోందన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏయూకు ఉన్న ప్రతిష్టకు నిదర్శనంగానే విదేశీ విద్యార్థులంతా ఇక్కడ విద్యను అభ్యసిస్తున్నారని కొనియాడారు. యువతరం శాంతి, సుస్థిరతకు పాటుపడాలని సూచించారు. ఏయూ అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలతో విద్యనందిస్తోందని ప్రశంసించారు. విభిన్న దేశాల సంస్కృతులను పంచుకుంటూ సామరస్య జీవనం సాగించాలని ఆమె పిలుపునిచ్చారు. ఏయూ వీసీ ఆచార్య జి.పి.రాజశేఖర్ మాట్లాడుతూ.. వర్సిటీ నిర్వహిస్తున్న ప్రత్యేక కార్యక్రమాల్లో ఇది ఒకటని తెలిపారు. కొద్ది రోజుల కిందట నిర్వహించిన ఫుడ్ ఫెస్టివల్‌కు అనూహ్య స్పందన వచ్చిందన్నారు. అంతర్జాతీయ విద్యార్థి వ్యవహారాల డీన్ ఆచార్య పాల్ డగ్లస్ మాట్లాడుతూ.. ఏయూలో ప్రస్తుతం 57 దేశాలకు చెందిన 1,150 మంది విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారని వెల్లడించారు. కార్యక్రమంలో అసోసియేట్ డీన్లు ఆచార్య ఎన్.ఎం.యుగంధర్, ఆచార్య విజయశాంతి తదితరులు పాల్గొన్నారు. అనంతరం విదేశీ విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు ఆహూతులను ఎంతగానో అలరించాయి. ప్రత్యేక వస్త్రధారణలతో, ఆకట్టుకునే ఆహార్యంతో తమ దేశ సంస్కృతీ సంప్రదాయాలను, నృత్య రీతులను పరిచయం చేస్తూ వారు నిర్వహించిన కార్యక్రమం ఆద్యంతం ఉత్సాహభరితంగా సాగింది.
అనకాపల్లి కలెక్టర్ విజయ కృష్ణన్


