ఏకపక్ష నిర్ణయాలపై వెల్లువెత్తుతున్న విమర్శలు పాలక మండలిని పక్కనపెట్టి నిర్ణయాలు తాజాగా డాక్టరేట్ల ప్రదానంపై అసంతృస్తి సెగలు
విశాఖ సిటీ: శతాబ్ది ఉత్సవాల వేళ ఆంధ్ర విశ్వవిద్యాలయం విమర్శల పాలవుతోంది. పాలకుల ఏకపక్ష నిర్ణయాలతో వివాదం రాజుకుంటోంది. వందేళ్ల ఘన చరిత్ర కలిగిన ఈ యూనివర్సిటీ.. పాలక మండలిని విస్మరించి చేస్తున్న ఆలోచనలు అసంతృప్తికి కారణమవుతున్నాయి. పాలకుల వ్యక్తిగత అజెండాలకు వేదికగా ఏయూను మారుస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే వరుస వివాదాలు ఏయూను చుట్టుముడుతున్న సమయంలో నిబంధనలు, సంప్రదాయాలను పట్టించుకోకుండా తీసుకున్న నిర్ణయాలు వర్సిటీలో అగ్గి రాజేస్తున్నాయి. తాజాగా ఏయూ పూర్వ విద్యార్థి, బ్యాంక్ ఆఫ్ అమెరికా వైస్ చైర్మన్ డాక్టర్ పూర్ణచంద్రరావు సగ్గుర్తికి డాక్టరేట్ అందించడం పెద్ద చర్చకు దారితీసింది. ఆయనకు డాక్టరేట్ ఇవ్వడాన్ని ఎవరూ తప్పుబట్టకపోయినా.. ఇచ్చే విధానంపైనే అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా ఇటువంటి నిర్ణయాలను పాలక మండలి సమావేశంలో చర్చించి, సభ్యుల దృష్టికి తీసుకువెళ్లడం ఆనవాయితీగా వస్తోంది. కానీ, ప్రస్తుత పాలకులు ఈ సంప్రదాయాన్ని పక్కనపెట్టి, తమకు నచ్చినట్లుగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. దీనిపై పలువురు అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది.
పాలక మండలిని పక్కనపెట్టి నిర్ణయాలు
ఏయూలో గత కొంతకాలంగా పాలక మండలి ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. యూనివర్సిటీకి సంబంధించిన ఏ నిర్ణయమైనా మండలి సభ్యుల దృష్టికి వెళ్లాలి. అక్కడ చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. కానీ, వర్సిటీ పాలకులు మాత్రం అధికారం తమ చేతుల్లో ఉందన్న నెపంతో సభ్యులను ఉత్సవ విగ్రహాలుగా మారుస్తున్నారన్న చర్చ జరుగుతోంది. కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా కీలక నిర్ణయాలు తీసుకోవడంపై స్వయంగా మండలి సభ్యుల్లోనే తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. వ్యవస్థాగతమైన పద్ధతులను కాదని, వ్యక్తిగత నిర్ణయాలకు ప్రాధాన్యం ఇవ్వడం వల్ల వర్సిటీలో ఉండాల్సిన ఆరోగ్యకరమైన వాతావరణం దెబ్బతింటోందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
వివాదాల సుడిగుండంలో విద్యా నిలయం
ఇప్పటికే ఆంధ్ర విశ్వవిద్యాలయం వరుస వివాదాలతో సతమతమవుతోంది. విద్యార్థులకు సౌకర్యాల లేమి, పాలనలో రాజకీయ జోక్యం వంటి అంశాలపై వరుసగా విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఇలాంటి తరుణంలో పాలకులు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సింది పోయి, వివాదాస్పద నిర్ణయాలతో అగ్నికి ఆజ్యం పోస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. శతాబ్ది ఉత్సవాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ సమయంలో, ఇలాంటి ఆరోపణలు రావడం వర్సిటీ పూర్వ విద్యార్థులను, విద్యావేత్తలను కలచివేస్తోంది. ఇప్పటికై నా పాలకులు తమ ఒంటెద్దు పోకడలను మానుకోవాలని, నిర్ణయాల ప్రక్రియలో పారదర్శకతను పాటించాలని సూచిస్తున్నారు. పాలక మండలి సభ్యులను సమన్వయం చేసుకుంటూ, నిబంధనల ప్రకారం ముందుకు సాగాలని హితవు పలుకుతున్నారు.


