మహానేతపై చంద్రబాబు ప్రభుత్వం కక్ష
విశాఖలో తరచూ దివంగత డాక్టర్ వైఎస్సార్ విగ్రహాలు, పేరుపై దాడి
కూటమి ప్రభుత్వం గెలిచిన
తొలి రోజుల్లోనే
వైఎస్సార్ వ్యూ పాయింట్ ధ్వంసం
అంతర్జాతీయ క్రికెట్ స్టేడియానికి
డాక్టర్ వైఎస్సార్ పేరు తొలగింపు
తాజాగా పెందుర్తిలో
వైఎస్సార్ విగ్రహం కూల్చివేత
చంద్రబాబు ప్రభుత్వ తీరుపై
సర్వాత్ర విమర్శల వెల్లువ
పెందుర్తి: ‘రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా సువర్ణ పాలన అందించిన మహానాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి. ఇప్పటికీ ప్రజలకు ఆయన అందించిన పథకాలే శ్రీరామ రక్షగా ఉన్నాయి. వైఎస్సార్ ఎన్నటికీ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. కానీ చంద్రబాబు ప్రభుత్వం ఆయన మరణించిన తరువాత కూడా కక్ష సాధింపులకు పాల్పడడం దుర్మార్గం. అలాంటి నాయకుడి విగ్రహాన్ని ఇలా కూల్చివేయడం సరికాదు’ పెందుర్తికి చెందిన ఓ పెద్దాయన మాట ఇది. ఉమ్మడి తెలుగు రాష్ట్రానికి సువర్ణ పాలన అందించిన దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డిపై సీఎం చంద్రబాబు అడుగడుగునా అక్కసు వెళ్లగక్కుతున్నారు. విశాఖ జిల్లాలో డాక్టర్ వైఎస్సార్ జ్ఞాపకాలను తుడిచి వేసేందుకు శాయశక్తుల కుట్రలు చేస్తున్నారు. నగరంలోని తొట్లకొండ సమీపంలోని డాక్టర్ వైఎస్సార్ సీ వ్యూ పాయింట్‌ను కూటమి అధికారంలోకి వచ్చిన తొలి రోజే టీడీపీ గుండాలు ధ్వంసం చేశారు. తరువాత డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియానికి పేరు మార్చింది ప్రభుత్వం. తాజాగా పెందుర్తి కూడలి వద్ద రోడ్డు విస్తరణ పేరుతో డాక్టర్ వైఎస్సార్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన తీరుపై సర్వాత్ర నిరసన వ్యక్తమవుతుంది.
ఇంత అక్కసా..
ముఖ్యమంత్రిగా ఉమ్మడి విశాఖ జిల్లాకు డాక్టర్ వైఎస్సార్ సేవలు మరువలేనివి. ఆయన సేవలకు గుర్తుగా అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంకు అప్పటి ప్రభుత్వం వైఎస్సార్ పేరు పెట్టింది. అయితే చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్‌పై ఒత్తిడి తీసుకువచ్చి వైఎస్సార్ పేరును చెరిపేసింది. తాజాగా పెందుర్తిలో వైఎస్సార్ విగ్రహాన్ని రోడ్డు విస్తరణ పేరుతో కూల్చడం పెద్ద వివాదాన్నే రేపింది. రోడ్డు విస్తరణ పేరుతో చంద్రబాబు, మేయర్ సూచనలతో అత్యంత నిర్లక్ష్యంగా కూల్చివేయడం పట్ల ప్రజలు దుమ్మెత్తి పోస్తున్నారు.
ఎన్టీఆర్ విగ్రహం అయితే ఇలాగే చేస్తారా..
గత ఐదేళ్లు వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉన్నన్నాళ్లు ఏనాడూ ఎన్టీఆర్ విగ్రహాల జోలికి పోలేదు. కానీ చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి డాక్టర్ వైఎస్సార్ విగ్రహాలపై కక్ష సాధింపు చేస్తున్నారు. అధికార మదంతో ఇలా విర్రవీగిపోతున్నారు. ఇదే రోడ్డు విస్తరణలో ఎన్టీఆర్ విగ్రహాన్ని తొలగించాల్సి వస్తే కూటమి ప్రభుత్వం ఇలాగే చేస్తుందా.. రానున్న రోజుల్లో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక వీటిపై న్యాయబద్ధంగా విచారణ చేసి తగిన చర్యలు ఉంటాయి.
– అదీప్‌రాజ్, మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ ఉత్తరాంధ్ర యువజన విభాగం అధ్యక్షుడు,
మహానేతపై చంద్రబాబు ప్రభుత్వం కక్ష
మహానేతపై చంద్రబాబు ప్రభుత్వం కక్ష


