జీసీసీ వైస్ చైర్మన్ ఎండీగా శోబిక బాధ్యతల స్వీకరణ
మహారాణిపేట: గిరిజన సహకార సంస్థ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఎస్.ఎస్.శోబిక గురువారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు జీసీసీ వైస్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్న కల్పనా కుమారిని ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్‌గా బదిలీ చేశారు. శోబికా విధుల్లో చేరిన వెంటనే జీసీసీ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సంస్థ అమలు చేస్తున్న కార్యక్రమాల గురించి, వివిధ అంశాలపై చర్చించారు. అరకు వ్యాలీ కాఫీ, మార్కెటింగ్, ఇతర అంశాలపై ప్రస్తుతం నెలకొన్న సమస్యలపై పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని, జీసీసీ ప్రధాన కార్యాలయం, క్షేత్ర స్థాయి సిబ్బంది నిబద్ధతతో పనిచేయాలన్నారు. సంస్థ పురోభివృద్ధికి, గిరిజనుల జీవనోపాధుల కల్పనకు శక్తి వంచన లేకుండా కృషి చేయాలన్నారు. అనంతరం గిరిజన సహకార సంస్థలో విజిలెన్సు, ఫైనాన్స్, మార్కెటింగ్, రిటైల్ మార్కెటింగ్, కాఫీ, పరిపాలన, అకౌంట్స్, రవాణా శాఖలను పరిశీలించారు.


