ప్రైవేట్ బస్సులో మంటలు
తాటిచెట్లపాలెం: తాటిచెట్లపాలెం జంక్షన్ వద్ద గురువారం మధ్యాహ్నం ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కంచరపాలెం పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది తెలిపిన వివరాలివి. విజయనగరం నుంచి బెంగళూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు తాటిచెట్లపాలెం జంక్షన్ వద్దకు రాగానే అకస్మాత్తుగా పొగలు, మంటలు వ్యాపించాయి. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ బస్సును నిలిపివేసి, అందులో ఉన్న 17 మంది ప్రయాణికులను హుటాహుటిన కిందకు దించేశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. కంచరపాలెం పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించి, ప్రయాణికులను మరో బస్సులో గమ్యస్థానాలకు తరలించారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.


