కారు ఢీకొని లారీ కిందకు..
రెడ్డీస్ ల్యాబ్ ఉద్యోగి దుర్మరణం
తగరపువలస: దాకమర్రి రఘు ఇంజినీరింగ్ కళాశాల వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో విజయనగరం నాగవంశం వీధికి చెందిన కరుభుక్త సంజీవ్(22) దుర్మరణం చెందాడు. ఇదే ప్రమాదంలో జొన్నాడ లెండీ కళాశాల విద్యార్థి మోక విజయరామ్(19) తీవ్రంగా గాయపడ్డాడు. ప్రత్యక్ష సాక్షులు, బంధువులు తెలిపిన వివరాలి.. శ్రీకాకుళం జిల్లా పైడి భీమవరం రెడ్డీస్ లేబొరేటరీలో పనిచేస్తున్న సంజీవ్, బుధవారం భీమిలి మండలం లక్ష్మీపురంలోని బంధువుల ఇంటికి బారసాల నిమిత్తం వచ్చాడు. అదే రోజు మహరాజుపేటలోని మరో బంధువుల ఇంటికి వెళ్లాడు. గురువారం ద్విచక్రవాహనంపై విజయనగరం వెళ్లే క్రమంలో రాజాపులోవ కూడలి వద్ద లెండీ కళాశాల విద్యార్థికి లిఫ్ట్ ఇచ్చాడు. వీరిద్దరూ బైక్‌పై వెళ్తుండగా ముందు వరుసగా కారు, లారీ వెళ్తున్నాయి. ద్విచక్రవాహనంపై ముందుకు వెళ్లే ప్రయత్నంలో కారు పక్క నుంచి ఢీకొట్టడంతో, బైక్ అదుపుతప్పి లారీ వెనుక టైరు కింద పడిపోయింది. ఈ ప్రమాదంలో సంజీవ్ తల నుజ్జునుజ్జు కాగా, వెనుక కూర్చున్న విద్యార్థి ఎగిరి కారుపై పడటంతో కాలు విరిగిపోయింది. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం 108 వాహనంలో నగరంలోని ఆసుపత్రికి తరలించారు. సంజీవ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భీమిలి ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు. మృతుని తల్లిదండ్రులు శ్రీదేవి, శ్రీనులకు ఇద్దరు సంతానం. పెద్దవాడైన సంజీవ్‌తో పాటు అతని తమ్ముడు కూడా రెడ్డీస్ ల్యాబ్‌లో పని చేస్తున్నాడు. ప్రమాదంపై భీమిలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


