మద్యం కోసం బస్సు ఎత్తికెళ్లిన డ్రైవర్
ఎంవీపీకాలనీ: మద్యానికి బానిసైన ఓ ప్రైవేట్ డ్రైవర్ ఏపీఎస్‌ఆర్టీసీ హైర్ బస్‌ను ఎత్తికెళ్లిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. గత రెండు రోజులుగా ఈ ఘటనను గోప్యంగా ఉంచిన ఎంవీపీ క్రైమ్ పోలీసులు గురువారం ఒక ప్రకటనలో వివరాలు వెల్లడించారు. టీవీ నాయుడు అనే వ్యాపారి మద్దిలపాలెం డిపో ద్వారా 6 హైర్ బస్సులు ఆర్టీసీ సర్వీసులుగా అద్దెకు నడుపుతున్నాడు. అతని వద్ద ఉన్న డ్రైవర్లలో అనకాపల్లి జిల్లా మారేడిపూడికి చెందిన ఈగల పైడిరాజు ఒకరు. ఈ నెల 16వ తేదీన శ్రీకాకుళం రూట్‌లో తిరుగుతున్న ఏపీ39యూఎక్స్ 2888 బస్సు రాత్రి 9 గంటలకు విశాఖ వచ్చింది. డ్రైవర్ జి.అప్పారావు బస్సుకు 195 లీటర్లు డీజిల్ కొట్టించి మద్దిలపాలెం డిపోలో పార్క్ చేసి వెళ్లిపోయాడు. 17వ తేదీ తెల్లవారు జామును అతడు వచ్చిచూడగా బస్సు కనిపించలేదు. దీంతో ఓనర్ టీవీ నాయుడికి సమాచారం ఇవ్వడంతో ఇద్దరూ పలు ప్రాంతాల్లో వెతికినా కనిపించలేదు. 18వ తేదీన ఎంవీపీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు సీసీ టీవీ ఫుటేజ్‌లను పరిశీలించి లంకెలపాలెం వైపు వెళ్లినట్లు గుర్తించారు. అటువైపు గ్రామాల్లో పనిచేసే డ్రైవర్లు ఎవరైనా ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు చేశారు. మారేడిపూడికి చెందిన ఈగల పైడిరాజు బస్సుతో పాటు రామాటాకీస్ వద్ద పట్టుబడ్డాడు. దీంతో అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. మద్యానికి బానిసైన కారణంగా బస్సులో ఫుల్‌ట్యాంక్ డీజిల్ ఉంటుందనే సమాచారంతోనే బస్సును దొంగిలించి డీజిల్ అమ్ముకున్నట్లు పైడిరాజు పోలీసుల దర్యాప్తులో చెప్పాడు. అయితే ఈ నెల 17వ తేదీన జరిగిన ఈ ఘటనను ఎంవీపీ క్రైమ్ పోలీసులు గొప్యంగా ఉంచడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఆర్టీసీ సర్వీసులో ఉండి దొంగతనానికి గురైన ఓ హైర్ బస్సును పట్టుకునేందుకు క్రైమ్ పోలీసులకు 5 రోజులు పట్టడం గమన్హారం.


