భూ సేకరణను వేగవంతం చేయాలి
విశాఖ సిటీ: భవిష్యత్తులో అభివృద్ధి, అవసరాల దృష్ట్యా విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ (వీఈఆర్) అమలుకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని మెట్రోపాలిటన్ కమిషనర్ ఎన్.తేజ్‌భరత్ సంబంధిత తహసీల్దార్లను ఆదేశించారు. వీఈఆర్ అమలు ప్రక్రియను వేగవంతం చేసే దిశగా ఆయన సోమవారం వీఎంఆర్‌డీఏ సమావేశ మందిరంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ ప్రభుత్వ భూముల లభ్యత జాబితా తయారీ, ల్యాండ్ పూలింగ్ వంటి అంశాలపై భీమిలి, విశాఖ, విజయనగరం రెవెన్యూ డివిజన్లకు చెందిన ఆర్డీఓలు, తహసీల్దార్లతో చర్చించారు. అనంతరం ప్రభుత్వ భూముల వినియోగానికి భూసేకరణను వేగవంతంగా చేపట్టాలని చెప్పారు. సమావేశంలో వీఎంఆర్‌డీఏ ఎస్టేట్ అధికారి దయానిధి, ఇతర అధికారులు పాల్గొన్నారు.


