రోడ్డు ప్రమాదంలో బీబీఏ విద్యార్థి మృతి
ఆరిలోవ: జాతీయ రహదారిపై సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో శశాంక్ (20) అనే బీబీఏ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. ఆరిలోవ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సుజాతనగర్‌కు చెందిన శశాంక్ రుషికొండలోని గాయత్రి కళాశాలలో రెండో సంవత్సరం చదువుతున్నాడు. కాలేజీకి వెళ్లేందుకు విశాఖ వ్యాలీ కూడలి వద్ద వాహనం దిగి రోడ్డు దాటుతుండగా, గీతం కళాశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనం అతడిని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శశాంక్ తలకు తీవ్ర గాయమై రక్తస్రావం కావడంతో ఆరిలోవ ట్రాఫిక్ ఎస్సై ధర్మేంద్ర వెంటనే స్పందించి అంబులెన్స్‌లో కేజీహెచ్‌కు తరలించారు. అయితే ఆస్పత్రికి చేరుకునేలోపే శశాంక్ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. బైక్ నడిపిన విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న శశాంక్ తండ్రి లక్ష్మణకుమార్ కన్నీరుమున్నీరుగా విలపించారు. తండ్రి ఫిర్యాదు మేరకు ఆరిలోవ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


