పీజీఆర్‌ఎస్ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి
విశాఖ సిటీ: ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్‌ఎస్)కు వచ్చే ఫిర్యాదులపై దృష్టి పెట్టి సత్వరమే పరిష్కరించాలని మెట్రోపాలిటన్ కమిషనర్ ఎన్.తేజ్‌భరత్ అధికారులను ఆదేశించారు. సోమవారం వీఎంఆర్‌డీఏ సమావేశ మందిరంలో నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌కు మొత్తం 12 ఫిర్యాదులు వచ్చాయి. కమిషనర్ స్వయంగా ఫిర్యాదుదారులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. వెంటనే సంబంధిత అధికారులతో నిర్ణీత గడువులోగా వాటిని పరిష్కరించాలని చెప్పారు. ఫిర్యాదుదారులు కార్యాలయం చుట్టూ తిరగకుండా ఎటువంటి న్యాయపరమైన చిక్కులు లేని వాటిపై వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. ప్రణాళికా విభాగానికి 7, ఎస్టేట్ విభాగానికి 2, ఇంజినీరింగ్‌కు 2, పరిపాలనకు 1 ఫిర్యాదు వచ్చింది. ఈ కార్యక్రమంలో వీఎంఆర్‌డీఏ జాయింట్ కమిషనర్ రమేష్, కార్యదర్శి మురళీకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.


