విద్యార్థుల కోసం ‘మార్నింగ్ న్యూట్రిషన్’
మహారాణిపేట : మధ్యాహ్న భోజన పథకానికి అనుబంధంగా విద్యార్థులకు వారంలో మూడు రోజుల పాటు ఉదయం పూట ‘మార్నింగ్ న్యూట్రిషన్‘ పేరుతో బలవర్ధక ఆహారం అందించనున్నట్లు కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ పేర్కొన్నారు. అక్షయపాత్ర ఫౌండేషన్ సహకారంతో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉదయం పూట అందించేందుకు ఉద్దేశించిన మార్నింగ్ న్యూట్రిషన్ కార్యక్రమాన్ని సోమవారం కలెక్టరేట్‌లో ఆయన ప్రారంభించారు. తొలి విడత 178 పాఠశాలల్లోని విద్యార్థులకు అందజేస్తామని, రానున్న రోజుల్లో జిల్లాలోని అన్ని పాఠశాలల విద్యార్థులకు అందిస్తామని పేర్కొన్నారు. ఇలాంటి కార్యక్రమం రాష్ట్రంలో మరెక్కడా లేదని కలెక్టర్ చొరవతో జిల్లాలో మాత్రమే అమలు చేస్తున్నామని డీఈవో ఎన్.ప్రేమకుమార్ తెలిపారు. కార్యక్రమంలో అక్షయపాత్ర ఫౌండేషన్ ప్రతినిధులు రామమోహన్‌రావు, వివిధ విభాగాల జిల్లా స్థాయి అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.


