ఇద్దరు బాలురను కాపాడిన లైఫ్‌గార్డ్స్
భీమునిపట్నం: భీమిలి తీరంలో మైరెన్ పోలీసులు, లైఫ్‌గార్డులు అప్రమత్తంగా వ్యవహరించి ఇద్దరు బాలురను రక్షించారు. పద్మనాభం మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన కర్రి జశ్వంత్, కర్రి అజయ్ కుమార్ తమ కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం భీమిలి బీచ్‌కు వచ్చారు. వీరు సరదాగా సముద్రంలో స్నానానికి దిగగా.. ఒక్కసారిగా అలల ఉధృతికి లోపలికి కొట్టుకుపోయారు. ఇది గమనించిన మైరెన్ పోలీసులు, లైఫ్‌గార్డులు వెంటనే స్పందించారు. వేగంగా నీటిలోకి వెళ్లి ఆ బాలురిద్దరినీ క్షేమంగా రక్షించి ఒడ్డుకు చేర్చారు. మైరెన్ సీఐ శ్రీనివాసరావు ఆ బాలురను వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. అలల ఉధృతి ఎక్కువగా ఉన్నందున ప్రమాదకరమైన తీర ప్రాంతాల్లో ఎవరూ స్నానాలకు దిగవద్దని, పర్యాటకులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
నేడు పీజీఆర్‌ఎస్ రద్దు
మహారాణిపేట: కలెక్టరేట్లో ప్రతి సోమవారం జరిగే పీజీఆర్‌ఎస్ వినతుల స్వీకరణ కార్యక్రమం ఈ వారం రద్దు అయినట్టు కలెక్టర్ హరేందిర ప్రసాద్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 14, 15వ తేదీల్లో జరగనున్న భాగస్వామ్య సదస్సు ఏర్పాట్ల పనుల్లో అధికార యంత్రాంగం నిమగ్నమై ఉన్నందున 10వ తేదీన జరగాల్సిన పీజీఆర్‌ఎస్‌ను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అర్జీదారులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. వచ్చేవారం 17వ తేదిన యథావిధిగా పీజీఆర్‌ఎస్ ఉంటుందని కలెక్టర్ ప్రకటనలో స్పష్టం చేశారు.
జీవీఎంసీలో కూడా..
డాబాగార్డెన్స్: జీవీఎంసీలో నిర్వహించనున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక రద్దు చేస్తున్నట్టు కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు.
పోలీసు కమిషనరేట్‌లో..
అల్లిపురం: సోమవారం నగర పోలీస్ కమిషనరేట్‌లో నిర్వహించనున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక రద్దు చేసినట్లు సీపీ శంఖబ్రత బాగ్చి తెలిపారు.


