‘బాల్యం’ ఉపాధ్యాయులకు ముగిసిన శిక్షణ
సీతంపేట: బాల్యం కేంద్రాలకు వచ్చే పిల్లలను ఉజ్వల భవిష్యత్తుకు సోపానాలుగా ఉపాధ్యాయులు తీర్చిదిద్దాలని చైల్డ్ రైట్స్ అవేర్‌నెస్ ఫోరం రాష్ట్ర కన్వీనర్ గొండు సీతారాం అన్నారు. అక్కయ్యపాలెం ఎన్జీజీవోస్ కాలనీలోని జీవీఎంసీ ప్రైమరీ పాఠశాలలో జీవీఎంసీ బాల్యం ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు, సూపర్‌వైజర్లకు రెండు రోజుల పాటు జరిగిన అవగాహన సదస్సు ముగింపు కార్యక్రమం ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీతారాం మాట్లాడుతూ పిల్లలకు ఎంతో ఉపయుక్తంగా ఉండాలన్న సంకల్పంతో పెద్ద బాలశిక్షలోని 8 పర్వాలను ప్రామాణికంగా తీసుకుని పుస్తకాన్ని రూపొందించడం హర్షణీయమన్నారు. దీనిపై రెండు రోజుల పాటు ఉపాధ్యాయులకు, సూపర్‌వైజర్లకు అవగాహన సదస్సు నిర్వహించడం చాలా ఉపయుక్తమని, దీనివల్ల ఉపాధ్యాయులకు సబ్జెక్టుపై మరింత అవగాహన పెంచినవారమవుతామని తెలిపారు. ఈ సదస్సుకు హాజరైన ఉపాధ్యాయులకు సీతారాం, బాల్యం ప్రాజెక్టు కోఆర్డినేటర్ ఆవుపాటి మోహన్‌కుమార్, తెలుగు పండిట్ హైమావతి చేతుల మీదుగా ధ్రువీకరణ పత్రాలు అందజేశారు.


