సందడిగా వన భోజనాలు
ఆరిలోవ: పవిత్ర కార్తీక మాసం మూడవ ఆదివారం నగరంలోని పర్యాటక కేంద్రాలు జనసంద్రంగా మారాయి. కై లాసగిరి, ఇందిరా గాంధీ జూ పార్క్, ముడసర్లోవ వంటి ప్రాంతాలు వేలాది మంది సందర్శకులతో కోలాహలంగా కనిపించాయి. అయితే కంబాలకొండ మాత్రం వెలవెలబోయింది. కార్తీక మాసం కావడంతో, కుటుంబ సమేతంగా వనభోజనాలు చేసేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో జూ పార్కుకు తరలివచ్చారు. పచ్చని చెట్ల నీడన భోజనాలు చేస్తూ, వన్యప్రాణులను చూస్తూ ఆనందంగా గడిపారు. అడవి దున్నలు, పులులు, ఏనుగులు, కోతులు వంటి జంతువులు ఎన్‌క్లోజర్‌లో హుషారుగా తిరుగుతూ సందర్శకులను ఆకట్టుకున్నాయి. లవ్‌బర్డ్స్, ఆఫ్రికన్ పేరెట్స్, నెమళ్ల జోన్ల వద్ద పక్షుల కిలకిలరావాలు పిల్లలను, పెద్దలను అలరించాయి. ఆదివారం ఒక్కరోజే 7,865 మంది జూ పార్కును సందర్శించారు. వీరి ద్వారా రికార్డు స్థాయిలో రూ. 6,07,640 ఆదాయం లభించినట్లు జూ క్యూరేటర్ జి.మంగమ్మ తెలిపారు. అయితే ఈ పార్కుకు సమీపంలోనే ఉన్న కంబాలకొండ ఎకో టూరిజం పార్కు మాత్రం సందర్శకులు లేక వెలవెలబోయింది. కార్తీక మాసం వనభోజనాలకు పేరొందిన ఈ ప్రాంతంలో ఈ వారం ఆ సందడి కనిపించలేదు. కేవలం 500 మంది సందర్శకులు మాత్రమే పార్కుకు వచ్చారని సిబ్బంది తెలిపారు. వారి ద్వారా కేవలం రూ. 42,000 ఆదాయం లభించిందన్నారు. అటవీశాఖ అధికారులు కంబాలకొండ అభివృద్ధిపై దృష్టి సారించకపోవడం, సందర్శకులను ఆకట్టుకునే వినోద కార్యక్రమాలు, సౌకర్యాలు ఏర్పాటు చేయకపోవడమే ఈ నిరాదరణకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది.
కై లాసగిరి కిటకిట
కై లాసగిరికి వేలాది మంది ప్రజలు కుటుంబాలతో తరలివచ్చి వనభోజనాలు చేశారు. కార్లు, ఆటోలు వంటి వాహనాల సంఖ్య ఎక్కువ కావడంతో ఘాట్ రోడ్డులో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. పిల్లలు ఆట పరికరాల వద్ద, పెద్దలు కబడ్డీ, టగ్ ఆఫ్ వార్ వంటి ఆటలు ఆడుతూ సరదాగా గడిపారు. వ్యూ పాయింట్, శివ పార్వతుల విగ్రహాల వద్ద ఎక్కువ మంది ఫొటోలు తీసుకున్నారు.
ఆటలాడుతున్న పిల్లలు
సందడిగా వన భోజనాలు
సందడిగా వన భోజనాలు
సందడిగా వన భోజనాలు
సందడిగా వన భోజనాలు
సందడిగా వన భోజనాలు
సందడిగా వన భోజనాలు
సందడిగా వన భోజనాలు


