చిన్నారికి టీకా.. నూరేళ్ల జీవితానికి భరోసా
మహారాణిపేట: పిల్లలు వ్యాధుల బారిన పడకుండా ఎదిగితేనే ఆరోగ్యకర సమాజం ఏర్పడుతుంది. పూర్వం పురిట్లోనే ప్రాణాలు వదలడం, మాతాశిశు మరణాలు ఉండేవి. చిన్నారి ఎదిగే క్రమంలో అంతుచిక్కని రోగాల బారిన పడి మృత్యువాత పడేవారు. వైద్య విజ్ఞానం అప్పట్లో అంతగా అభివృద్ధి చెందకపోవడంతో కుటుంబాల్లో జననాల సంఖ్య పెంచుకునే వారు. ప్రస్తుతం వైద్య రంగంలో పెను మార్పులు వచ్చాయి. శాస్త్ర, పరిశోధనలు అనేక రోగాల నివారణకు అద్భుత ఔషధాలను తెచ్చాయి. పుట్టిన క్షణం మొదలు పిల్లలకు 16 ఏళ్లు వచ్చే వరకు ఆరోగ్య శాఖ వేస్తున్న టీకాలతో ఆరోగ్యవంతంగా ఎదిగి వారంతా రేపటి పౌరులుగా మారుతున్నారు.
అపోహలు వీడదాం.. ఆరోగ్యాన్ని కాపాడుదాం
వ్యాధులు దరిచేరకుండా ఉండాలంటే టీకాలు వేయించుకోవడం చాలా ముఖ్యం. అప్పుడే పుట్టిన చిన్నారుల నుంచి పెద్ద వారి వరకు ప్రతి ఒక్కరూ వివిధ వయసులో టీకాలు కచ్చితంగా వేయించుకోవాలి. అప్పుడే రోగనిరోధక శక్తి పెరిగి అందరూ ఆరోగ్యంగా ఉంటారు. అయితే ఈ టీకాలపై ప్రజల్లో చాలా అపోహలు ఉన్నాయి. టీకాలు వేయించడం ద్వారా జ్వరాలు రావడం, బలహీనపడతారని అపోహలతో వాటికి దూరంగా ఉంటున్నారు. టీకాలపై అవగాహన కల్పించడం కోసం ప్రపంచ వ్యాప్తంగా నవంబర్ 10న అంతర్జాతీయ టీకాల దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం ‘అందరికీ రోగ నిరోధకత మానవులకు సాధ్యమే’అనే థీమ్‌తో ముందుకెళ్తున్నారు.
ఆరోగ్య వ్యవస్థకు బలమైన కవచం
టీకాలు మన ఆరోగ్య వ్యవస్థకు బలమైన కవచం లాంటివి. స్మాల్ ఫాక్స్, పోలియో వంటి వ్యాధులను నిర్మూలించిన టీకాలు.. కోట్లాది ప్రాణాలను రక్షించాయి. టీకాలు అందరికీ చేరినప్పుడే సమగ్ర రోగనిరోధకత సాధ్యమవుతుంది. కేంద్ర ప్రభుత్వం యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రొగ్రామ్ కింద ఏటా లక్షలాది శిశువులకు, గర్భిణులకు ఉచిత టీకాలను అందిస్తోంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజా ఆరోగ్య కార్యక్రమంగా నిలుస్తోంది. ఆశ కార్యకర్తలు, ఏఎన్‌ఎం, నర్సులు అంకితభావంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు.
ప్రతి బుధవారం, శనివారాల్లో వ్యాక్సిన్
పుట్టిన బిడ్డ నుంచి 16 ఏళ్ల వయసు వరకు పిల్లలు ఆరోగ్యవంతంగా ఎదిగేందుకు 12 రకాల వ్యాక్సిన్‌లు వేస్తున్నారు. ప్రతి బుధవారం, శనివారాల్లో ఆస్పత్రులు, పంచాయతీ కేంద్రాలు, అంగన్‌వాడీ కేంద్రాలు, సచివాలయాల వద్ద సిబ్బంది అందుబాటులో ఉంటూ టీకాలు వేస్తున్నారు. గర్భిణులు, బాలింతలు అశ్రద్ధ చేయకుండా క్రమం తప్పకుండా టీకాలు వేయించుకుని వ్యాధుల నుంచి రక్షణ పొందాలని డాక్టర్ బి.లూసీ సూచించారు.
జిల్లాలో అందుబాటులో
ఉన్న టీకాలు
ప్రస్తుతం జిల్లాలో పలు రకాల వ్యాక్సిన్‌లు అందుబాటులో ఉన్నాయని జిల్లా వ్యాధి నిరోధక అధికారి డాక్టర్ బి.లూసీ తెలిపారు. డీపీటీ, ఎఫ్‌ఐపీవీ, ఓపీవీ, హెపటైటిస్ బి, ఎంఆర్, బీసీజీ, పీసీవీ, టీడీ, రోటవైరస్ వ్యాక్సిన్‌లు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్నట్లు వెల్లడించారు. యూనివర్సిల్ ఇమ్యూనైజేషన్ ప్రొగ్రామ్‌లో భాగంగా వీటిని ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు.


