177కే ఆంధ్ర ఆలౌట్
107 పరుగుల ఆధిక్యంలో తమిళనాడు
విశాఖ స్పోర్ట్స్: దేశవాళీ ఫస్ట్‌క్లాస్ క్రికెట్ టోర్నమెంట్ రంజీ ట్రోఫీలో భాగంగా వైఎస్సార్ ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో జరుగుతున్న ఎలైట్–ఏ గ్రూప్ మ్యాచ్‌లో తమిళనాడు జట్టు ఆంధ్రపై తొలి ఇన్నింగ్స్‌లో స్వల్ప ఆధిక్యాన్ని ప్రదర్శించింది. రెండో రోజు ఆట ముగిసేసరికి మ్యాచ్‌పై పట్టు సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన తమిళనాడు తొలి ఇన్నింగ్స్‌లో 182 పరుగులకు ఆలౌట్ అయిన విషయం తెలిసిందే. రెండో రోజు ఆదివారం ఓవర్ నైట్ స్కోరు ఒక వికెట్ నష్టానికి 20 పరుగులతో ఆటను ప్రారంభించిన ఆంధ్ర జట్టు.. తమిళనాడు బౌలర్ల ధాటికి త్వరత్వరగా వికెట్లను కోల్పోయింది. ఆంధ్ర బ్యాటర్లు భరత్ (12), విజయ్ (3), కెప్టెన్ రికీ భుయ్ (4), కరణ్ షిండే (9), అశ్విన్ హెబ్బర్ (13), రాజు (1) పెవిలియన్‌కు క్యూ కట్టడంతో జట్టు స్కోరు 100 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో రషీద్ (87 నాటౌట్) ఒక్కడే అద్భుత పోరాటం కనబరిచాడు. సౌరభ్ (30) తో కలిసి కాసేపు వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డా, మిగిలిన బ్యాటర్లు పృథ్వీ (డకౌట్), సాయితేజ (2) సహకారం అందించకపోవడంతో ఆంధ్ర జట్టు తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 177 పరుగులకే ఆలౌటైంది. దీంతో తమిళనాడు జట్టుకు తొలి ఇన్నింగ్స్‌లో 5 పరుగుల కీలక ఆధిక్యం లభించింది. ఆల్‌రౌండర్ సందీప్ 4 వికెట్లు, త్రిలోక్, సోను, సాయి కిశోర్ తలో 2 వికెట్లు తీశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన తమిళనాడు.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్లు కోల్పోయి 102 పరుగులు చేసింది. ఓపెనర్ నారాయణ్ (డకౌట్) నిరాశపరిచినా, మరో ఓపెనర్ విమల్ (20) కొంత సేపు ఆడాడు. బాలసుబ్రమణ్యం (51) అర్ధ సెంచరీతో రాణించి రనౌట్ అయ్యాడు. ప్రస్తుతం ప్రదోష్ (26), కెప్టెన్ సాయికిశోర్(0 ) క్రీజులో ఉన్నారు. ఆంధ్ర బౌలర్లలో పృథ్వీ, రాజు చెరో వికెట్ తీసుకున్నారు. ప్రస్తుతం తమిళనాడు 107 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఆట మరో రెండు రోజులు మిగిలి ఉంది.
177కే ఆంధ్ర ఆలౌట్


