‘రెట్రో’ రచ్చ.. పిక్నిక్ కేక
ఏయూ క్యాంపస్: నిత్యం కుటుంబ బాధ్యతలు, ఆఫీస్ పనుల ఒత్తిడితో గడిపే నగర మహిళలు... ఒక్కరోజు ఆ పనులన్నింటికీ బ్రేక్ ఇచ్చి, పూర్తి ఉత్సాహంతో ఆనందంగా గడిపారు. బీచ్‌రోడ్డులోని వీఎంఆర్డీఏ పార్కు వేదికగా ఆదివారం జరిగిన లేడీస్ పిక్నిక్‌లో నగరంలోని వివిధ రంగాలకు చెందిన మహిళలు, యువతులు ఒక్కచోట చేరి సందడి చేశారు. రెట్రో థీమ్‌తో నిర్వహించిన ఈ పిక్నిక్‌లో.. పాత తరం నటీమణులను గుర్తుచేస్తూ మహిళలు ధరించిన వస్త్రధారణ, ఆ హావభావాలతో నిర్వహించిన ర్యాంప్ వాక్ అందరినీ ఆకట్టుకున్నాయి. ఆనాటి ఫ్యాషన్‌కు నేటి తరం హంగులు అద్ది, మహిళలు చేసిన ఫ్యాషన్ వాక్ ఆహూతులను కట్టిపడేసింది. కార్యక్రమంలో భాగంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వింటేజ్ రోల్స్ రాయిస్ కారు వద్ద ఫొటోలు దిగేందుకు మహిళలు ఉత్సాహం చూపించారు. బెల్లీ డ్యాన్స్ ప్రదర్శన, ప్రత్యేకమైన సెల్ఫీ బూత్ వంటివి కార్యక్రమానికే హైలెట్‌గా నిలిచాయి. మహిళలందరూ కలిసికట్టుగా ఆటపాటలతో అల్లరి చేస్తూ, తమ దైనందిన జీవితంలోని ఒత్తిడిని మరిచిపోయారు. ఈ సందడి నడుమ.. ఇటీవల ప్రపంచ కప్ గెలిచిన మహిళా క్రికెట్ క్రీడాకారుల విజయాన్ని గుర్తు చేసుకుని, వారిని అభినందించడం విశేషం. అనంతరం వివిధ పోటీల్లో గెలుపొందిన వారికి నిర్వాహకుడు వీరూ మామ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. విందు, వినోదాలతో ఈ కార్యక్రమం ఉత్సాహంగా ముగిసింది.
‘రెట్రో’ రచ్చ.. పిక్నిక్ కేక


