కన్ను!
దేవాలయ భూములపై
ప్రేమ సమాజానికి గతంలో దాతలు ఇచ్చిన భూములు రుషికొండలో 47.33 ఎకరాలు
కూటమి
విలువైన సింహాచలం భూములు ప్రైవేటు కంపెనీల పరం నగర శివారు భూములను దేవస్థానానికి ఇచ్చేందుకు ప్రయత్నాలు ప్రేమ సమాజం భూములనూ కాజేసేందుకు యత్నాలు టూరిజం ప్రాజెక్టుల పేరిట కొట్టేసేందుకు కుట్ర ఏసీఏకు 10 ఎకరాలు ఇవ్వాలంటూ కూటమి నేతల కుయుక్తులు
సింహాచలం దేవస్థానానికి చెందిన భూములు
అడవివరంలో
150 ఎకరాలు
మధురవాడలో
107 ఎకరాలు
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం :
ఇప్పటివరకు ప్రైవేటు, ప్రభుత్వ భూములపై కన్నేసి కాజేస్తున్న కూటమి ప్రభుత్వం, నేతలు.. ఇప్పుడు దేవస్థానం భూములపై పడ్డారు. సింహాచలంతోపాటు ప్రేమ సమాజానికి చెందిన విలువైన భూములను ప్రాజెక్టుల పేరిట చేజిక్కించుకునే ప్రయత్నాలు ప్రారంభించినట్టు తెలుస్తోంది. సింహాచలం దేవస్థానానికి మధురవాడ, అడవివరంలో ఉన్న విలువైన భూములను తీసుకుని.. నగరానికి వెలుపల కాలుష్య ప్రభావిత భూములను దేవస్థానానికి అప్పగించేందుకు పావులు కదుపుతున్నట్టు సమాచారం. ఇందులో భాగంగా సింహాచలం దేవస్థానానికి చెందిన భూముల విలువను తక్కువగా లెక్కగట్టి.. అందుకు బదులుగా నగరానికి దూరంగా ఇచ్చే భూముల విలువను మాత్రం అధికంగా లెక్కకట్టారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఇలా చేస్తారంట...?
వాస్తవానికి సింహాచలం దేవస్థానానికి మధురవాడలో 107 ఎకరాలు, అడవివరంలో 150 ఎకరాల భూమి ఉంది. ఇందులో మధురవాడలోని 107 ఎకరాల భూమిని గూగుల్ సంస్థకు, అడవివరంలోని 150 ఎకరాల భూమిని ఒక ప్రైవేటు హోటల్‌కు అప్పగించేందుకు రంగం సిద్ధమవుతోంది. ఇందుకు బదులుగా ఎక్కడో దూరంగా గాజువాక వద్ద ఉన్న భూములను ప్రత్యామ్నాయంగా ఇచ్చేందుకు ఇప్పటికే రెవెన్యూ వ్యవహారాలు ప్రారంభమయ్యాయి.
● మరోవైపు సేవా సంస్థ అయిన ప్రేమ సమాజానికి చెందిన భూములను కూడా వివిధ టూరిజం ప్రాజెక్టుల పేరిట చేజిక్కించుకునేందుకు కూటమి ఎమ్మెల్యేలు ప్రయత్నాలు షురూ చేశారు. అలాగే ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ)కు 10 ఎకరాలు కావాలంటూ కూటమి నేతలు లేఖలతో అమరావతిలో కలియతిరుగుతున్నట్టు తెలుస్తోంది. మొత్తంగా దేవస్థానం భూములను లీజుకు ఇవ్వొచ్చంటూ తాజాగా ప్రభుత్వం జారీచేసిన ఆదేశాల నేపథ్యంలో కూటమి నేతలు తమ ప్రయత్నాలను షురూ చేశారు.
ప్రేమ సమాజం భూములపై ఎప్పటి నుంచో గురి..!
ప్రేమ సమాజానికి దాతలు ఇచ్చిన 47.33 ఎకరాల భూమి రుషికొండలో ఉంది. ఇందులో 33 ఎకరాలకుపైగా గతంలోనే టీడీపీ నేతలు లీజుకు తీసుకున్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ప్రేమ సమాజం భూములను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడాన్ని వ్యతిరేకించింది. ఇందుకు అనుగుణంగా సదరు ప్రైవేటు వ్యక్తికి అప్పగించిన భూముల లీజును రద్దు చేయడంతోపాటు ప్రేమ సమాజం భూములను సంస్థకే అప్పగించింది. నగరాల్లో ఉండే దేవస్థానాలకు చెందిన భూములను దీర్ఘకాలిక లీజుకు ఇచ్చేందుకు కమిటీని నియమిస్తూ ప్రభుత్వం అక్టోబరు 31న ఆదేశాలు జారీచేసింది. ఇందుకు అనుగుణంగా మరోసారి విలువైన ప్రేమ సమాజం భూములను రిసార్టు, టూరిజం పేరుతో చేజిక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా ఏసీఏకు 10 ఎకరాలు కావాలంటూ కూటమికే చెందిన మరో ఎమ్మెల్యే ఒక వినతిపత్రాన్ని కూడా ప్రభుత్వానికి సమర్పించినట్టు సమాచారం. మొత్తంగా రుషికొండలోని విలువైన భూములను చేజిక్కించుకునేందుకు పలు ప్రతిపాదనలతో కూటమి నేతలు కుయుక్తులు పన్నుతున్నట్టు విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
టూరిజం, గూగుల్ పేరుతో..!
ఒకవైపు ప్రేమ సమాజం భూములను కూటమి నేతలు ప్రైవేటు వ్యక్తుల పేరుతో, టూరిజం ప్రాజెక్టుల పేరుతో చేజిక్కించుకునేందుకు యత్నిస్తుండగా.. సింహాచలానికి చెందిన అడవివరంలోని భూములను టూరిజం ప్రాజెక్టు పేరుతో ఓ హోటల్‌కు అప్పగించేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తుండటం గమనార్హం. సింహాచలం దేవస్థానానికి చెందిన అడవివరంలోని 150 ఎకరాల భూమిని ఒక ప్రైవేటు హోటల్‌కు ఇచ్చేందుకు ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. దీనికి ప్రతిగా దూరంగా ఉన్న భూములను దేవస్థానానికి అప్పగించేందుకు ఫైల్స్ సిద్ధమవుతున్నాయి. మధురవాడలో విలువైన 107 ఎకరాల భూమిని గూగుల్ సంస్థకు అప్పగించేందుకు రంగం సిద్ధమవుతోంది. ఒకవైపు డేటా సెంటర్ పేరుతో తర్లువాడలోని పేద దళిత భూములను కాజేసేందుకు ప్రయత్నిస్తున్న ప్రభుత్వం.. వీటికి తోడు దేవస్థానం భూములను కూడా అప్పగించేందుకు సిద్ధమవుతుండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.


