పదోన్నతుల ‘సహకారం’
డీసీసీబీలో పదోన్నతులకు వసూళ్లు పోస్టును బట్టి రూ.3 – 5 లక్షలు డీజీఎం, ఏజీఎం, చీఫ్‌మేనేజర్లు, మేనేజర్లు ఇతర పదోన్నతులు పూర్తి కీలక నేత సన్నిహితుడు రూ.కోటి వరకు వసూలు చేసినట్లు ఆరోపణలు
విశాఖ సిటీ : జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో పదోన్నతుల వ్యవహారం అగ్గిరాజేస్తోంది. ఈ ప్రక్రియలో రూ.కోటి వరకు చేతులు మారాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. బ్యాంకులో కీలక వ్యక్తి సన్నిహితుడే మామూళ్ల తతంగాన్ని నడిపించారన్న వార్తలు గుప్పుమంటున్నాయి. పదోన్నతులకు ఒక్కొక్కరి నుంచి పోస్టును బట్టి రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలు వరకు వసూలు చేసినట్లు సిబ్బంది చెవులు కొరుక్కుంటున్నారు. జిల్లా కేంద్ర సహకార బ్యాంక్(డీసీసీబీ)కి ప్రధాన కార్యాలయం కాకుండా మరో 33 బ్రాంచ్‌లు ఉన్నాయి. వీటిలో ఖాళీలను పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలని నిర్ణయించారు. ఒక డీజీఎం, నాలుగు ఏజీఎం, నాలుగు చీఫ్ మేనేజర్, ఆరు మేనేజర్, 12 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహించాలని భావించారు. ఇందుకోసం బ్యాంక్ పర్సన్ ఇన్‌చార్జి, సీఈవో, ఆప్కాబ్ నుంచి జనరల్ మేనేజర్, ఆప్కాబ్ నామినేట్ చేసిన సబ్జెక్ట్ నిపుణుడు ఒకరు ఉన్నారు. ఈ బోర్డు ఆధ్వర్యంలో గత నెల 23, 24 తేదీల్లో ఇంటర్వ్యూలు సైతం నిర్వహించారు.
పోస్టుకు రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలు
ఈ పదోన్నతులకు నిర్వహించిన ఇంటర్వ్యూల్లో డీజీఎం పోస్టుకు ఒకరు, నాలుగు ఏజీఎం పోస్టులకు నలుగురు, నాలుగు చీఫ్ మేనేజర్ పోస్టులకు 18 మంది, ఆరు మేనేజర్ పోస్టులకు 20, 12 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు 60 మంది పాల్గొన్నారు. ఉద్యోగి సర్వీస్‌కు 80, పనితీరుకు 10, ఇంటర్వ్యూలో మరో 10 మార్కులు కలిపి మొత్తంగా 100 మార్కులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. సర్వీసు మార్కులను పక్కనపెడితే, పనితీరుకు ఉద్యోగి పై అధికారి 10 మార్కులు, ఇంటర్వ్యూలో 10 మార్కులు దక్కించుకోవాల్సి ఉంటుంది. ఇక్కడే మతలబులు జరిగినట్లు ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి.
20 మార్కుల్లోనే మతలబు
20 మార్కులు బోర్డు చేతుల్లో ఉండడంతో ఇక్కడే బేరసారాలు జరిగినట్లు సిబ్బందిలో చర్చ జరుగుతోంది. అడిగిన మొత్తం ఇవ్వని పక్షంలో పదోన్నతికి అవకాశం లేదని పలువురికి తెగేసి చెప్పారన్న వాదనలు ఉన్నాయి. పోస్టును బట్టి రూ.3 నుంచి రూ.5 లక్షలు డిమాండ్ చేసినట్లు సమాచారం. ఇందుకోసం బ్యాంకులో కీలక వ్యక్తి సన్నిహితుడు రంగంలోకి దిగి తెరవెనుక తతంగాన్ని నడిపారన్న టాక్ ఉంది. చీఫ్ మేనేజర్, మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు భారీగా డిమాండ్ ఉండడంతో వాటి కోసం పలువురు అడిగిన మొత్తాన్ని సమర్పించుకున్నట్లు చర్చ జరుగుతోంది. వారికే పదోన్నతులు కల్పిస్తూ గత నెల 31వ తేదీన ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై పలువురు ఉద్యోగులు ఆప్కాబ్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీనిపై త్వరలోనే విచారణకు ఆదేశించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే మెరిట్, రోస్టర్ ప్రకారమే పదోన్నతులు చేపట్టినట్లు బ్యాంకు ఉన్నతాధికారులు ఆరోపణలను కొట్టి పారేస్తున్నారు.


