సమన్వయంతో భాగస్వామ్య సదస్సుకు ఏర్పాట్లు
మహారాణిపేట : ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ఈ నెల 14, 15వ తేదీల్లో జరగనున్న భాగస్వామ్య సదస్సుకు అధికారులంతా సమన్వయంతో పటిష్ట ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో మంగళవారం పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి, జాయింట్ కలెక్టర్ కె.మయూర్ అశోక్, డీసీపీలు మేరీ ప్రశాంతి, లతామాధురి ఇతర అధికారులతో కలిసి ఏర్పాట్లపై సమీక్షించారు. ఇప్పటివరకు ఆయా శాఖల పరిధిలో జరిగిన పనులు, తీసుకున్న చర్యలు, చేసిన ఏర్పాట్లపై ఆరా తీశారు. 9వ తేదీలోగా పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. స్పాట్ రిజిస్ట్రేషన్‌కు అవకాశం లేదని తెలిపారు. ముఖ్యమంత్రితోపాటు, గవర్నర్, ఉప రాష్ట్రపతి కార్యక్రమంలో భాగస్వామ్యమయ్యే అవకాశం ఉందని, అన్ని రకాల భద్రతాపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు సూచించారు. అన్ని రకాల సంస్కృతులను ప్రతిబింబించేలా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి మాట్లాడుతూ దేశ, విదేశాల నుంచి ప్రముఖులు విచ్చేస్తున్న క్రమంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాల్సి ఉందని, దీనికి అనుగుణంగా అధికార యంత్రాంగం, సీఐఐ నుంచి సహకారం కావాలని పేర్కొన్నారు. అన్ని ప్రధాన కూడళ్లు, వేదికల వద్ద సీసీ టీవీ కెమెరాలు పెట్టాలని, డ్రోన్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతి ఒక్కరూ ఫొటోతో కూడిన ఐడీ కార్డును ధరించాలని సూచించారు. కార్యక్రమానికి వచ్చే అతిథులు, ఇతర అధికారుల వివరాలను 10వ తేదీలోగా అందజేయాలని సీఐఐ ప్రతినిధులను కోరారు.
భాగస్వామ్య సదస్సు ఏర్పాట్ల పరిశీలన
ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో భాగస్వామ్య సదస్సు ఏర్పాట్లను కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ పరిశీలించారు. మంగళవారం ఉదయం జేసీ కె.మయూర్ అశోక్‌తో కలిసి వేదిక వద్దకు వెళ్లిన ఆయన అక్కడ పరిస్థితులను గమనించారు. ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో సమీక్షించి తగిన సూచనలు చేశారు. గ్రౌండ్ లెవెలింగ్, జంగిల్ క్లియరెన్స్, మొబైల్ టాయిలెట్ల ఏర్పాటు, పార్కింగ్, ప్రవేశ ద్వారాలు, సుందరీకరణ, డ్రెయిన్ల నిర్వహణ తదితర ఏర్పాట్లపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.


