21 నుంచి మార్గశిర మాసోత్సవాలు
మహారాణిపేట: ఈ నెల 21 నుంచి డిసెంబర్ 19 వరకు కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో జరిగే మార్గశిర మాసోత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేందిర ప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం జరిగిన సమన్వయ కమిటీ సమావేశంలో పలు అంశాలపై మార్గదర్శకాలు జారీ చేశారు. ఆయా రోజుల్లో ట్రాఫిక్ మళ్లింపు, బారికేడ్లు, సరిపడా క్యూలైన్లు, మంచినీటి సదుపాయం, వైద్య శిబిరాలు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు.
ఆ సమయంలోనే దర్శనాలు..
మార్గశిర మాసోత్సవాల్లో నాలుగు గురువారాలు నవంబర్ 27, డిసెంబర్ 04, 11, 18వ తేదీల్లో వస్తున్నట్లు ఈవో కె.శోభారాణి వెల్లడించారు. ఈ దినాల్లో బుధవారం తెల్లవారుజాము 2.30 గంటల నుంచే దర్శనాలు ప్రారంభమవుతాయన్నారు. వీఐపీలకు ఉదయం 6 నుంచి 8 వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 వరకు స్లాట్స్ కేటాయించినట్లు వెల్లడించారు. సమావేశంలో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ సీహెచ్‌వీ రమణ, ఏఈవో రాజేంద్ర, పోలీసు అధికారులు, వివిధ విభాగాల జిల్లా స్థాయి అధికారులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
స్వయం అభిషేకాలపై
పునరాలోచించాలి
ఆలయానికి వచ్చే భక్తులు స్వయంగా పాలు, పసుపు కుంకుమలు, పుష్పాలతో అమ్మవారికి అభిషేకాలు చేయడంపై వైదిక కమిటీ పునరాలోచన చేయాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. పూజా సామగ్రిని భక్తుల నుంచి పూజారులు/వలంటీర్లు తీసుకుని అమ్మవారికి సమర్పించేలా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. దీనిపై పోలీసు అధికారులు కూడా ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. ఈవో శోభారాణి స్పందిస్తూ... వైదిక కమిటీ దృష్టిలో పెట్టి తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. క్యూలైన్లలో చిన్న పిల్లలకు పాలు, బిస్కెట్లు అందుబాటులో ఉంచాలని కలెక్టర్ ఆదేశించారు. వీఐపీ, వీవీఐపీల దర్శనాలు నిర్ణీత వేళల్లోనే జరిగేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అనంతరం ఉత్సవాల పోస్టర్‌ను కలెక్టర్, ఇతర అధికారుల చేతుల మీదుగా ఆవిష్కరించారు.


