
మద్యం మత్తులో నిందితుడు హల్‌చల్
డీ మార్ట్ భవనంపై నుంచి
దూకుతానంటూ బెదిరింపులు
గోపాలపట్నం: మద్యం మత్తులో ఉన్న ఒక వ్యక్తి డీ మార్ట్ భవనంపైకి ఎక్కి, కిందకు దూకేస్తానని బెదిరించి కలకలం సృష్టించాడు. గోపాలపట్నం, గాజువాక పోలీసులు అతన్ని కిందకు దించి, పరిస్థితిని సుఖాంతం చేశారు. వివరాల్లోకి వెళితే.. కొద్ది రోజులుగా పరారీలో ఉన్న హత్యకేసు నిందితుడు వడ్డాది కృష్ణ గోపాలపట్నం ప్రాంతంలో ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో గాజువాక, గోపాలపట్నం పోలీసులు అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నించారు. అయితే మద్యం సేవించి ఉన్న కృష్ణ, పోలీసుల నుంచి తప్పించుకునేందుకు గోపాలపట్నంలోని డీ మార్ట్ భవనం పై అంతస్తు సన్‌షెడ్‌పైకి ఎక్కాడు. కిందకు దూకేస్తా అని హల్‌చల్ చేయడంతో.. ఏ ప్రమాదం జరుగుతుందోనని స్థానికులు ఆందోళన చెందారు. పోలీసులు, స్థానికులు కలిసి రగ్గు లాంటి దాన్ని కింద పట్టుకుని అతన్ని కాపాడేందుకు యత్నించారు. ఎట్టకేలకు పోలీసులు అతన్ని నచ్చజెప్పి, సురక్షితంగా కిందకు దించారు. దీంతో అక్కడ గుమిగూడిన వారంతా ఊపిరి పీల్చుకున్నారు. వడ్డాది కృష్ణ గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలో హత్యా యత్నం కేసులో నిందితుడు. కొద్ది రోజులుగా పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు. గోపాలపట్నం పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని గాజువాక పోలీసులకు అప్పగించారు.