
మెడికల్ కాలేజీలు ధారాదత్తం
సీతంపేట: కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను పీపీపీ పద్ధతిలో ప్రైవేటు యాజమాన్యాలకు ధారాదత్తం చేయడం ఖాయమని, ఈ విషయాన్ని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నర్సీపట్నం పర్యటనలో బట్టబయలు చేయడంతో మింగుడు పడని కూటమి నాయకులు అవాకులు చెవాకులు పేలుతున్నారని వైఎస్సార్ సీపీ క్రిస్టియన్ మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు బొల్లవరపు జాన్‌వెస్లీ అన్నారు. లలితానగర్‌లోని తన కార్యాలయంలో శనివారం మీడియాతో ఆయన మాట్లాడుతూ జనసేన దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటుపరం చేయడం లేదని ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ మాట్లాడారన్నారు. పార్టీ అధినేత వైఎస్ జగన్‌కు పీపీపీకి, ప్రైవేట్‌కు తేడా తెలియదని అజ్ఞానంతో ఆయన చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని తెలిపారు. విద్య, వైద్యం అనేవి వైద్య విద్యలోనే కలిసి ఉన్నాయని, అవి ప్రజల ప్రాథమిక హక్కులకు, ప్రజల మనోభావాలకు, జీవితాలకు సంబంధించిన అంశమని, వాటిని తాకట్టుపెట్టే అధికారం నైతికంగా ఏ ప్రభుత్వానికి లేదన్నారు. ఈ విషయాన్ని వంశీకృష్ణ తెలుసుకోవాలని సూచించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా గత వైఎస్ జగన్ ప్రభుత్వంలో 17 మెడికల్ కాలేజీల ఏర్పాటుకు అనుమతులిచ్చి నిర్మాణాలు ప్రారంభించడం రాష్ట్రానికి వైద్య రంగంలో ఒక వరంగా భావించాలన్నారు. కూటమి ప్రభుత్వం పేద, మధ్యతరగతి విద్యార్థులకు వైద్య విద్యను దూరంగా, భారంగా మార్చిందన్నారు. సామాన్యులు వైద్యాన్ని డబ్బులిచ్చి కొనుక్కునే పరిస్థితి ప్రభుత్వ ఆస్పత్రుల్లో వస్తుందన్నారు. ఆరోగ్యశ్రీకి తూట్లు పొడవడంతో వైద్యం కోసం వెళ్లే ప్రజలు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. కూటమి సర్కారు కళ్లు తెరిచి ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడకుండా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మెడికల్ కాలేజీలు, బోధన ఆస్పత్రులు నిర్వహించాలని జాన్‌వెస్లీ కోరారు.