
రౌడీషీటర్ హత్యకేసులో కొత్తకోణం
తొలుత పవన్ అనే వ్యక్తిపై గౌరీశంకర్ టీమ్ హత్యాయత్నం
అనంతరం రౌడీషీటర్ శ్రీధర్‌ను మరో మహిళతో కలిసి హత్య చేసిన వైనం
రెండు ఘటనల్లో నలుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు
ద్వారకా ఏసీపీ నరసింహమూర్తి వెల్లడి
ఎంవీపీకాలనీ: విజయవాడకు చెందిన రౌడీషీటర్ శ్రీధర్ హత్య కేసులో మరోకొత్త కోణం వెలుగు చూసింది. ఈ హత్యకేసులో నిందితుడైన యలమంచలికి చెందిన రౌడీషీటర్ గౌరీశంకర్ తొలుత మద్దిలపాలెంలో పవన్ అనే వ్యక్తిపై హత్యాయత్నం చేసినట్లు పోలీసులు వెల్లడించారు. శ్రీధర్ హత్య, పవన్ అనే వ్యక్తిపై హత్యాయత్నం ఘటనలకు సంబంధించి నలుగురిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి శనివారం రాత్రి ఎంవీపీ కాలనీ పోలీసు స్టేషన్‌లో ద్వారకా ఏసీపీ అన్నెపు నరసింహమూర్తి విలేకరులకు వివరాలు వెల్లడించారు. రౌడీషీటర్లు శ్రీధర్, గౌరీశంకర్‌లు పాతకేసుల్లో భాగంగా ఈ నెల 7వ తేదీన విశాఖ జిల్లా కోర్టుకు వాయిదాకు హాజరయ్యారు. అనంతరం విశాఖలోని పలు ప్రాంతాల్లో కారులో తిరుగుతూ మద్యం సేవించారు. గౌరీశంకర్‌కు విశాఖలో సాయి అనే స్నేహితుడు ఉన్నాడు. అతనికి పవన్ అనే వ్యక్తికి కొంతకాలంగా గొడవలు ఉన్నాయి. ఈ క్రమంలో పవన్‌ని హత్య చేయాలని గౌరీశంకర్, సాయి ఇటీవల నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో గౌరీశంకర్, శ్రీధర్, సాయి, అసీఫ్(సాయి స్నేహితుడు) కలిసి పవన్‌పై హత్యాయత్నానికి ప్రయత్నించారు. 7వ తేదీ రాత్రి మద్దిలపాలెంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే ఈ దాడి నుంచి పవన్ తప్పించుకొని పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎంవీపీ పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ఆరా తీశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు తొలుత సాయిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో ఈ హత్యాయత్నంలో తనతో పాటు గౌరీశంకర్, అసీఫ్‌లు కూడా ఉన్నట్లు సాయి వెల్లడించాడు. దీంతో పోలీసులు వారిని కూడా అదుపులోకి తీసుకొని విచారించి హత్యాయత్నంలో భాగస్వాములను చేశారు.
చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులు
ఈ ఘటనలో పోలీసులు చాకచక్యంగా వ్యవహరించడంతో రౌడీషీటర్ శ్రీధర్ హత్య వ్యవహారం వెలుగులోకి వచ్చింది. పవన్‌పై హత్యాయత్నం కేసు నమోదు చేసిన పోలీసులు తొలుత అదే కోణంలో దర్యాప్తు చేశారు. అయితే సెల్ టవర్ సిగ్నల్ పరిశీలించినప్పుడు గౌరీశంకర్ నెంబర్ సిగ్నల్ ఉన్న ప్రతీచోట మరో వ్యక్తి నెంబర్ వ్యక్తి కూడా కనిపించింది. అయితే ఆ వ్యక్తి ఎవరనే విషయంపై ఎంవీపీ పోలీసులు తొలి నుంచి అనుమానం వ్యక్తం చేశారు. పలు సిగ్నల్ పాయింట్‌ల్లో పరిశీలించినప్పడు కూడా ఇదే పరిస్థితి ఉండటంతో ఆ నెంబర్ ఎవరిదనే విషయంపై ఆరాతీశారు. ఈ విషయంపై గౌరీశంకర్‌ను తమదైన శైలిలో మరోసారి విచారించగా అసలు విషయం బయటపడింది. తొలుత 7వ తేదీ ఉదయం కోర్టుకు హాజరైన అనంతరం గౌరీశంకర్, శ్రీధర్ మద్యం సేవిస్తూ నగరంలో పలుచోట్ల తిరిగారు. అనంతరం శ్యామల అనే మహిళ ఇంటికి వెళ్లారు. రాత్రి మద్దిలపాలెంలో పవన్ అనే వ్యక్తిపై హత్యాయత్నం ఘటనలో పాల్గొన్నారు. తరువాత గౌరీశంకర్, శ్రీధర్ శ్యామల కలిసి కారులో అక్కడ నుంచి పరారయ్యారు. తరువాత గౌరీశంకర్, శ్రీధర్ మధ్య గొడవ చోటుచేసుకుంది. ఈ క్రమంలో గౌరీశంకర్, శ్యామల.. శ్రీధర్‌ను హత్యచేసి యలమంచలిలోని పోలవరం కెనాల్‌లో పడేశారు. ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించిన ఎంవీపీ పోలీసులను ఏసీపీ నరసింహమూర్తి ప్రశంసించారు. రెండు కేసుల్లో గౌరీశంకర్‌తో పాటు శ్యామల, సాయి, అసీఫ్‌లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంవీపీ సీఐ ప్రసాద్, ఎస్‌ఐ ధనుంజయ్‌నాయుడు తదితరులు పాల్గొన్నారు.