
చేపల వేటకు వెళ్లిన యువకుడి గల్లంతు
పరవాడ: చేపల వేటకు వెళ్లిన ఓ యువకుడు సముద్రపు కెరటాల తాకిడికి పడవ నుంచి జారి గల్లంతైన విషాద ఘటన పరవాడ మండలం ముత్యాలమ్మపాలెం తీరంలో శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముత్యాలమ్మపాలెం సమీపంలోని దిబ్బపాలెం గ్రామానికి చెందిన అరిజిల్లి బంగార్రాజు (17) ప్రాణాలు కోల్పోయాడు. చేతికి అందివచ్చిన కొడుకు సముద్రపు రాక్షస అలలకు బలై తమను అనాథలను చేశాడని మృతుడి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. మృతుడు బంగార్రాజుతో పాటు తోటి మత్స్యకారులు చింతకాయల కొర్లయ్య, కొండబాబు, మధు, హరి, మేరిగి ముత్యాలు... మొత్తం ఆరుగురు మత్స్యకారులు కలిసి ఒక తెప్పపై శనివారం తెల్లవారుజామున 2:30 గంటల సమయంలో చేపల వేటకు బయలుదేరారు. తీరాన్ని దాటి సముద్రంలోపలికి వెళ్తున్న క్రమంలో, సముద్రంపై నుంచి ఉధృతంగా వచ్చిన బలమైన కెరటం వీరు ప్రయాణిస్తున్న తెప్పను బలంగా ఢీకొట్టింది. ఆ సమయంలో తెప్పలో ఉన్న బంగార్రాజు ఒక్కసారిగా సముద్రంలో పడిపోయాడు. వెంటనే స్పందించిన తోటి కార్మికులు సముద్రంలో గాలించినప్పటికీ ఫలితం దక్కలేదు. అనంతరం మరో మూడు తెప్పలపై బంగార్రాజు ఆచూకీ కోసం గాలించినా ప్రయోజనం కనిపించలేదు. ప్రమాద సమాచారాన్ని అందుకున్న పరవాడ సీఐ ఆర్. మల్లికార్జునరావు తన సిబ్బందితో వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. తహసీల్దార్ బి.నాగరాజు కూడా ఘటనా స్థలాన్ని సందర్శించి, గల్లంతైన మృతదేహం కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని జిల్లా ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. శనివారం ఉదయం నుంచి మృతుడి జాడ కోసం పూడిమడక, పెదగంట్యాడ తీర ప్రాంతాల వరకు పడవలపై విస్తృతంగా గాలించారు. సాయంత్రానికి కూడా మృతుడి ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. జనసేన మండల ఇన్‌చార్జ్ పంచకర్ల ప్రసాద్, సర్పంచ్ చింతకాయల సుజాత మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రమాద కారణాలను అడిగి తెలుసుకున్నారు. మృతుడికి తండ్రి అప్పన్న, తల్లి సత్యవతి, అక్క మౌనిక ఉన్నారు. మృతుడి ఆచూకీ కోసం రాత్రి వరకు గాలింపు చర్యలు ముమ్మరం చేసినప్పటికీ ఫలితం కనిపించలేదు.

చేపల వేటకు వెళ్లిన యువకుడి గల్లంతు