ప్రభుత్వ భూమిపైప్రైవేటు వసూళ్లు! | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ భూమిపైప్రైవేటు వసూళ్లు!

Oct 12 2025 7:18 AM | Updated on Oct 12 2025 7:18 AM

ప్రభు

ప్రభుత్వ భూమిపైప్రైవేటు వసూళ్లు!

200 మంది నుంచి ఏకంగా రూ.50 కోట్లు స్వాహా!

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం:

ప్రభుత్వ భూమిని ప్రైవేటుగా చూపించి ఏకంగా రూ.50 కోట్లు వసూలు వ్యవహారం చర్చనీయాంశమవుతోంది. ఇందుకోసం ఇద్దరు తహసీల్దార్ల పేరుతో నకిలీ డాక్యుమెంట్లు, నకిలీ ఎండార్స్‌మెంట్లతో పాటు ఏకంగా నకిలీ ఈసీని కూడా సృష్టించిన వ్యవహారం తాజాగా వెలుగులోకి వచ్చింది. విద్యుత్‌శాఖలో పనిచేసే ఇద్దరు ఇంజనీర్లు (డీఈలు) ఈ తతంగమంతా నడిపించారు. తమతో పాటు పనిచేసే సుమారు 200 మంది నుంచి చెరో రూ.25 లక్షల చొప్పున మొత్తం రూ.50 కోట్ల వరకూ వసూలు చేశారు. మధురవాడ పనోరమ హిల్స్‌ జంక్షన్‌కు సమీపంలోని సర్వే నెంబరు 368–3లోని భూమిని చూపించి వసూళ్లకు తెగబడినట్టు తెలుస్తోంది. వాస్తవానికి ఇది ప్రభుత్వ భూమి. మొత్తం విస్తీర్ణం 3.6 ఎకరాలు. ఇక్కడ ఎకరా విలువ రూ.20 కోట్లకుపైగానే పలుకుతోంది. 100 అడుగుల రోడ్డుకు ఆనుకుని ఉన్న ఈ భూమి తక్కువ ధరకే అందుబాటులోకి వచ్చిందంటూ నమ్మించి భారీగా వసూలు చేశారు. ఇందుకోసం ఇద్దరు తహసీల్దార్ల పేరుతో ఫలానా వారికి పట్టా ఇచ్చారంటూ నకిలీ రికార్డులు సృష్టించారు. చలానాలు కూడా కట్టించి రిజిస్ట్రేషన్ల శాఖ సిబ్బందితో కలిసి రిజిస్ట్రేషన్‌ను పెండింగ్‌లో ఉంచేలా కథ నడిపించారు. నకిలీ ఈసీని కూడా సృష్టించి నమ్మించారు. అయితే, అవి నకిలీవని తెలియడంతో వారంతా ఇప్పుడు ఉసూరుమంటున్నారు. వారికి ఇప్పుడు మరో భూమిని చూపించి రిజిస్ట్రేషన్‌ చేస్తామంటూ కొత్త నాటకానికి తెరలేపినట్టు సమాచారం.

రూ.50 కోట్లు వసూళ్లు!

ఈ సర్వే నెంబరులోని భూమి తక్కువ ధరకే ఒక్కొక్కరికి రిజిస్ట్రేషన్‌ చేపిస్తామంటూ నమ్మబలికి మొత్తం 200 మంది నుంచి రూ.25 లక్షల చొప్పున వసూలు చేసినట్టు తెలుస్తోంది. వీరంతా విద్యుత్‌ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులు కావడం గమనార్హం. ఈ ముఠాకు నేతృత్వం వహిస్తున్న ఇద్దరు వ్యక్తులు కూడా విద్యుత్‌శాఖలో ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు. గతంలో ఈ విధంగానే 50 మంది నుంచి చెరో రూ.25 లక్షలు వసూలు చేసి ఒక ప్రైవేటు భూమిని కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్‌ చేయించడంతో వీరిపై నమ్మకం కుదిరింది. దీన్ని వాడుకుని ఈసారి ఏకంగా 200 మంది నుంచి రూ.25 లక్షల చొప్పున మొత్తం రూ.50 కోట్లు వసూలు చేశారు. విద్యుత్‌శాఖలో తమకు ఉన్న పరిచయాల ద్వారా తమ సిబ్బంది నుంచే ఈ విధంగా వసూళ్లకు పాల్పడ్డారు. అంతేకాకుండా ఎప్పటికప్పుడు కూట మి నేత, మాజీ హోంమంత్రి అండదండలున్నాయని కూడా బలంగా నమ్మించినట్టు తెలుస్తోంది.

రిజిస్ట్రేషన్‌ శాఖ సిబ్బందితో కలిసి..!

తహసీల్దార్ల పేరుతో నకిలీ డాక్యుమెంట్లు..!

మధురవాడలోని సర్వే నెంబరు 368–3లోని భూమి ప్రభుత్వానికి చెందినది. ఈ భూమిని లింగం సోమసుందరరావు పేరుతో పట్టా ఇచ్చారంటూ సెటిల్‌మెంట్‌ పట్టాను సృష్టించారు. గతంలో విశాఖ రూరల్‌ తహసీల్దార్లగా పనిచేసిన నరసింహమూర్తితో పాటు హత్యకు గురైన సనపాల రమణయ్య పేరు మీద నకిలీ డాక్యుమెంట్లు సృష్టించారు. నకిలీ అడంగల్‌, నకిలీ పట్టాలతో పాటు పై ఇద్దరూ తహసీల్దార్లు కూడా ఈ సర్వే నెంబరులో ఫలానా వ్యక్తికి పట్టా ఉందంటూ నివేదిక ఇచ్చినట్టు కూడా నకిలీ పత్రాలు ఏర్పాటు చేశారు. వసూలు చేసిన వారికి వీటిని చూపించడంతో పాటు రిజిస్ట్రేషన్‌ సిబ్బందితో కలిసి వ్యవహారం నడిపించారు. ఈ వ్యవహారంలో రిజిస్ట్రేషన్‌ శాఖలోని కొద్దిమంది సిబ్బందికి ఏకంగా రూ.కోటి వరకూ ముట్టచెప్పినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ప్రభుత్వ భూమిని ప్రైవేటు భూమిగా నకిలీ డాక్యుమెంట్లు

ఏకంగా నకిలీ ఈసీసృష్టించిన ముఠా

విద్యుత్‌శాఖలో పనిచేస్తున్న ఇద్దరు డీఈల నిర్వాకం

వాస్తవానికి ఈ సర్వే నెంబరులోని భూమి ప్రభుత్వానికి చెందినదని స్పష్టంగా రికార్డుల్లో ఉంది. నిషేధిత జాబితా (22ఏ)లో ఉంది. అందువల్ల రిజిస్ట్రేషన్‌ చేయడం కుదరదు. అయినప్పటికీ మధురవాడ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయానికి చెందిన ఒక అధికారితో మాట్లాడుకుని మొదటి దశలో ఒక 30 మంది రిజిస్ట్రేషన్‌కు వస్తారని... వారి నుంచి చలానా కట్టించుకుని రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రారంభించాలని కోరారు. ఇది ప్రభుత్వ భూమి కావడంతో రిజిస్ట్రేషన్‌ చేయడం కుదరనందున.. చలానాలు కట్టించుకుని రిజిస్ట్రేషన్‌ చేసినట్టుగా చేసి సహకరించాలని విన్నవించారు. ఆ తర్వాత రిజిస్ట్రేషన్‌ను పెండింగ్‌లో ఉంచితే చాలని కోరారు. ఇందుకోసం భారీగానే మాముళ్లు మాట్లాడుకున్నట్టు తెలుస్తోంది. ఈ విధంగానే మొత్తం వ్యవహారం నడిచింది. ఒక్కొక్కరు చెరో రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల మేర చలానా కూడా కట్టారు. తమకు రిజిస్ట్రేషన్‌ అయ్యిందని మొదటి బ్యాచ్‌ సంబరపడిపోయింది. మిగిలిన బ్యాచ్‌కు కూడా త్వరలో పెడతానంటూ సదరు ముఠా నమ్మబలికింది. అంతేకాకుండా మొదటగా రిజిస్ట్రేషన్‌ చేసిన వారికి దొంగ ఈసీలను కూడా సృష్టించి అందజేయడం గమనార్హం. విజయవాడలోని ఒక నిపుణుడైన డీటీపీ కార్యాలయంలో ఈ ఫేక్‌ ఈసీని సృష్టించి.. వారి పేరు మీద రిజిస్ట్రేషన్‌ అయినట్టుగా చూపించారు. అయితే కొందరు అవసరాల నిమిత్తం ఈ భూమిని విక్రయించడానికి ప్రయత్నించగా ఈసీ నకిలీదని తెలియడం అవాక్కయ్యారు. ఇప్పుడు అదే ముఠా కూటమిలోని ఒక నేత పేరుతో కొత్త సర్వే నెంబరుతో రిజిస్ట్రేషన్‌ కోసం దిగినట్టు తెలుస్తోంది.

ప్రభుత్వ భూమిపైప్రైవేటు వసూళ్లు!1
1/2

ప్రభుత్వ భూమిపైప్రైవేటు వసూళ్లు!

ప్రభుత్వ భూమిపైప్రైవేటు వసూళ్లు!2
2/2

ప్రభుత్వ భూమిపైప్రైవేటు వసూళ్లు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement