
తప్పించుకు తిరుగుతున్న నిందితుడికి రిమాండ్
అల్లిపురం: లైంగిక దాడి కేసులో రెండేళ్లుగా తప్పించుకు తిరుగుతున్న నిందితుడ్ని మహారాణిపేట పోలీసులు గురువారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ మేరకు వివరాలను ఇన్‌స్పెక్టర్ దివాకర్ యాదవ్ తెలిపారు. ప్రకాశం జిల్లా, చీరాల ప్రాంతానికి చెందిన పదార్థి వీరేంద్ర అలియాస్ చెర్రీ, 2017లో నమోదైన లైంగిక దాడి కేసులో అరెస్ట్ అయ్యి, ఆ తర్వాత బెయిల్‌పై విడుదలయ్యాడు. బెయిల్ పొందిన తర్వాత అతను కోర్టు వాయిదాలకు హాజరు కాకుండా పోలీసుల కళ్లు గప్పి తిరుగుతున్నాడు. ఈ నేపథ్యంలో నిందితుడిపై కోర్టు నాన్–బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. సెల్ ఫోన్ వాడకుండా, ఎవరికీ చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్న నిందితుడిని, సీఐ దివాకర్ యాదవ్ నేతృత్వంలోని పోలీసులు చాకచక్యంగా పట్టుకుని అరెస్ట్ చేశారు. అరెస్ట్ అనంతరం నిందితుడిని రిమాండ్‌కు తరలించారు.