
బాలల భద్రత, సంరక్షణకు ప్రాధాన్యం
విశాఖ లీగల్: బాలల సంరక్షణ, భద్రత అత్యంత ప్రాధాన్య అంశాలని విశాఖ జిల్లా న్యాయ సేవా ప్రాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఆర్.సన్యాసినాయుడు అన్నారు. శనివారం జిల్లా కోర్టు ప్రాంగణంలోని న్యాయ సేవ ప్రాధికార సంస్థ కార్యాలయంలో విశాఖ, అనకాపల్లి, అల్లూరి జిల్లాలకు సంబంధించిన పోలీసు, బాలల సంరక్షణ చట్టం, సీ్త్ర శిశు సంక్షేమ శాఖ అధికారులతో జరిగిన సమావేశంలో న్యాయమూర్తి ప్రసంగించారు. బాలలకు సంబంధించి ఇటీవల నేరాల సంఖ్య పెరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నారులకు భద్రత కల్పించడం, వారి ఆరోగ్యం, సంక్షేమం కీలకంగా చూడాలన్నారు. జువనైల్ సంక్షేమ పోలీస్ యూనిట్, బాలల సంక్షేమ కమిటీ, పోక్సో చట్టం, బాలలపై జరిగే లైంగిక నేరాల తీవ్రత, ప్రత్యేక భద్రతా వ్యవస్థ వంటి కమిటీల ప్రాధాన్యం, పనితీరు, ప్రభుత్వ సంస్థల చొరవ వంటి అంశాలపై న్యాయమూర్తి మాట్లాడారు. బాలల నేరాల విషయంలో ప్రభుత్వ యంత్రాంగం, సంబంధిత సంస్థలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విశాఖ జిల్లా సీ్త్ర శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ కె.వి.రామలక్ష్మి మాట్లాడుతూ చిన్నారులకు ఏ చిన్న ఇబ్బంది కలిగినా అందుకు సంబంధించిన సంస్థలు బాధ్యత వహించి, అప్రమత్తంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. నర్సీపట్నం అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి ఎం.రోహిత్, చోడవరం అదనపు జూనియర్ సివిల్ జడ్జి బి.సూర్యకళ, విశాఖ జిల్లా ప్రొబిషన్ అధికారి జి.శ్రీధర్, బాలల సంక్షేమ కమిటీ చైర్‌పర్సన్ ఎం.ఆర్.ఎల్.రాధ, జువనైల్ జస్టిస్ బోర్డ్ సభ్యుడు పి.సూర్య భాస్కరరావు, బాలల సంక్షేమ బోర్డు సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.