
ప్రగతిపథంలో వాల్తేరు డివిజన్
తాటిచెట్లపాలెం: వాల్తేర్ డివిజన్ గత రికార్డులను అధిగమిస్తూ ప్రగతిపథంలో దూసుకుపోతోందని డివిజనల్ రైల్వే మేనేజర్ లలిత్‌బొహ్రా తెలిపారు. డివిజనల్ రైల్వే మేనేజర్ కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ఆర్థిక సంవత్సంలో గడిచిన ఆరు నెలల్లో(ఏప్రిల్–సెప్టెంబరు) అధిక వృద్ధిని సాధించి, గత రికార్డులను అధిగమించినట్లు వెల్లడించారు. గతేడాది కంటే రోజువారీ లోడింగ్‌లో సగటున 10.78 శాతం, సరకు రవాణాలో 12.18 శాతం అధిక వృద్ధి రేటు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. సరకు రవాణాలో రోజుకు సగటున 59.6 రేక్‌ల లోడింగ్ జరిగిందన్నారు. మొత్తంగా 39.19 మిలియన్ టన్నుల సరకు లోడింగ్ ద్వారా రూ.4841 కోట్ల ఆదాయం సమకూరిందని, గత ఏడాది ఇది కేవలం రూ.4315.56 కోట్లు మాత్రమేనని తెలిపారు. ఈ సంవత్సరంలో ఇప్పటివరకు సుమారు 1.64 కోట్ల మంది ప్రయాణికులు ఒక్క విశాఖపట్నం స్టేషన్ నుంచి రాకపోకలు సాగించారని, వీరి ద్వారా సుమారు రూ.426 కోట్ల ఆదాయం సమకూరిందన్నారు. ప్రయాణికుల భద్రతలో రాజీ పడకుండా.. రైల్వే భద్రతా దళం, గవర్నమెంట్ రైల్వే పోలీసుల సహకారంతో ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. సీసీ కెమెరాలు, బాడీ వోర్న్ కెమెరాలు, డ్రోన్ కెమెరాల సహాయంతో ప్రయాణికుల భద్రతను మరింత పటిష్టం చేసినట్లు డీఆర్‌ఎం తెలిపారు. ప్రయాణికుల సౌకర్యార్థం విశాఖపట్నం రైల్వేస్టేషన్ మీదుగా 22 ప్రత్యేక రైళ్లు, 3,300 అదనపు కోచ్‌లు నడుపుతున్నట్లు చెప్పారు. ఇందులో విశాఖ నుంచి నాలుగు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు వివరించారు. డివిజన్ పరిధిలో మొత్తం 15 స్టేషన్లను అమృత్‌భారత్ స్టేషన్ కింద ఎంపిక చేసి అభివృద్ధి చేస్తున్నామని, వీటిలో విశాఖపట్నానికి సమాంతరంగా సింహాచలం, దువ్వాడ స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. అరకు వంటి పర్యాటక స్టేషన్లు కూడా మరింత అభివృద్ధి చెందుతున్నట్లు వెల్లడించారు. సమావేశంలో సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కె.పవన్‌కుమార్, సీనియర్ డివిజనల్ ఆపరేషన్స్ మేనేజర్ తన్మయ్ ముఖోపాధ్యాయ్, సీనియర్ డివిజనల్ సెక్యూరిటీ కమిషనర్ ఎ.పి.దూబే పాల్గొన్నారు.
గత రికార్డులను అధిగమించినట్లు డీఆర్‌ఎం వెల్లడి