
కరెంటోళ్ల నిర్లక్ష్యం!
విద్యుత్ కనెక్షన్లకు ఆధార్ సీడింగ్ అస్తవ్యస్తం
సాక్షి, విశాఖపట్నం: కరెంట్ బిల్లు కట్టకపోతే.. సామాన్యుల ఇళ్లని చీకటిమయం చేసే విద్యుత్‌శాఖ.. తాము చేసిన తప్పుల్ని మాత్రం కప్పిపుచ్చుకోవాలని యత్నిస్తుంది. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 37 వేల మంది విద్యుత్ కనెక్షన్ల ఆధార్ సీడింగ్‌ని తప్పుగా నమోదు చేసేసింది. ఫలితంగా దాదాపు 90 శాతం మంది ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దూరమైపోయారు. ఇటీవల వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక(సీజీఆర్‌ఎఫ్) చేసిన పరిశీలనల్లో.. ఏపీఈపీడీసీఎల్ అధికారులు, సిబ్బంది నిర్లక్ష్య వైఖరి బట్టబయలైంది. ఒకే ఒక్క ఆధార్ నంబర్‌ని ఏకంగా 500 ఇళ్లకు అనుసంధానం చేసేశారు. ఇలా.. ఒక ఆధార్ నంబర్‌ని 10 నుంచి 500 ఇళ్లకు సీడింగ్ చేస్తూ.. అడ్డగోలుగా వ్యవహరించారు. నెలరోజుల్లో తప్పులు సరిదిద్దాలంటూ సీజీఆర్‌ఎఫ్ ఈపీడీసీఎల్‌కు హెచ్చరిక జారీ చేసింది.
11 సర్కిళ్ల పరిధిలో 37,749 ఇళ్లకు తప్పుడు సీడింగ్.!
ఈపీడీసీఎల్ పరిధిలోని శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ, రాజమహేంద్రవరం, పశ్చిమ గోదావరి, ఏలూరు సర్కిళ్ల పరిధిలోని కొందరు వినియోగదారులు సీజీఆర్‌ఎఫ్‌కు గత కొద్ది నెలలుగా ఫిర్యాదులు చేస్తున్నారు. తాము అర్హులమైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దూరమవుతున్నామని.. విద్యుత్ బిల్లుల కారణంగానే జరుగుతోందని సచివాలయంలోనూ, మండల కార్యాలయాల్లో చెబుతున్నారంటూ ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. దీనిపై సీజీఆర్‌ఎఫ్ ఆరా తీసింది. సీజీఆర్‌ఎఫ్ చైర్మన్ విశ్రాంత జడ్జి బి.సత్యనారాయణ అధ్యక్షతన సభ్యులు ఎస్.రాజాబాబు(టెక్నికల్), ఎస్ మురళీకృష్ణ(ఇండిపెండెంట్) క్షేత్రస్థాయిలో పరిశీలనలు చేశారు. ఆగస్ట్ 19న తుది విచారణ పూర్తి చేశారు. మొత్తం తమ పరిశీలనలో విస్తుపోయేలా విద్యుత్ శాఖ సిబ్బంది నిర్లక్ష్య వైఖరికి అద్దంపట్టే అంశాలు బట్టబయలయ్యాయి. ఆగస్టు 19 నాటికి ఈపీడీసీఎల్ పరిధిలోని 11 సర్కిళ్లలో 37,749 విద్యుత్ కనెక్షన్లకు తప్పుగా ఆధార్ సీడింగ్ జరిగిందని తేలింది. పరిశీలన సమయంలో సర్కిళ్ల ఎస్‌ఈలు పాల్గొని సీడింగ్ ప్రక్రియలో లోపాలను స్పెషల్ డ్రైవ్ ద్వారా సరిదిద్దే ప్రక్రియ నిర్వహించారు.
విశాఖ సర్కిల్‌లో 2 ఆధార్లతో 1000 ఇళ్లకు సీడింగ్!
విద్యుత్ కనెక్షన్లను ఆధార్ సీడింగ్ చేయాలంటే ఇంటింటికీ వెళ్లి ఆధార్ నంబర్‌ని సేకరించడం.. లేదా ఫోన్ ద్వారా సేకరణ ప్రక్రియ చేపట్టడం చేయాల్సి ఉంది. కానీ ఈపీడీసీఎల్‌లోని కొంతమంది సిబ్బంది తమ వద్ద ఉన్న కనెక్షన్ల ప్రకారం.. అందులో ఉన్న ఆధార్ నంబర్లను సేకరించి.. సీడింగ్ ప్రక్రియని అడ్డగోలుగా చేసేశారు. కొన్ని చోట్ల ఒకే ఆధార్ నంబర్‌ని 500కి పైగా విద్యుత్ కనెక్షన్లకు సీడింగ్ చేసేశారు. కొన్ని ఆధార్ నంబర్లను 10, 20, 100, 400.. ఇలా.. తమకు నచ్చినట్లుగా అనుసంధానం చేసేసి.. చేతులు దులిపేసుకున్నారు. ఫలితంగా పరిమితికి మించి విద్యుత్ వినియోగించకున్నా లబ్ధిదారులు సంక్షేమ పథకాలకు దూరమైపోయారు. కొన్ని సర్కిళ్ల పరిధిలో ఒకే ఆధార్ నంబర్‌తో 500 ఇళ్ల విద్యుత్ కనెక్షన్లను సీడింగ్ చేసేశారంటే.. ఎలా కళ్లుమూసుకొని పనిచేశారో అర్థం చేసుకోవచ్చు. సీజీఆర్‌ఎఫ్ హెచ్చరికలతో అప్రమత్తమైన విద్యుత్‌సిబ్బంది దిద్దుబాటు ప్రక్రియ చేపడుతున్నారు. 37,749 కనెక్షన్లలో ఇంకా 13,572 కనెక్షన్లు సరిచేయాల్సి ఉంది. నెల రోజుల వ్యవధిలో ఈ ప్రక్రియ పూర్తి చేయాలంటూ సీజీఆర్‌ఎఫ్ తీర్పునిచ్చింది.
ఒకే ఆధార్‌ని 500కిపైగా ఇళ్లకు సీడింగ్ చేసిన కేసులు – 2
ఒకే ఆధార్‌ని 401 నుంచి 500 ఇళ్లకు సీడింగ్ చేసిన కేసులు – 2
ఒకే ఆధార్‌ని 301 నుంచి 400 ఇళ్లకు సీడింగ్ చేసిన కేసులు – 5
ఒకే ఆధార్‌ని 201 నుంచి 300 ఇళ్లకు సీడింగ్ చేసిన కేసులు – 3
ఒకే ఆధార్‌ని 101 నుంచి 200 ఇళ్లకు సీడింగ్ చేసిన కేసులు – 20
ఒకే ఆధార్‌ని 51 నుంచి 100 ఇళ్లకు సీడింగ్ చేసిన కేసులు – 59
ఒకే ఆధార్‌ని 10 నుంచి 50 ఇళ్లకు సీడింగ్ చేసిన కేసులు – 3,921
మొత్తం కేసులు – 4012
ఈపీడీసీఎల్ పరిధిలో ఆధార్ సీడింగ్‌లో లోపాలు
విశాఖపట్నం సర్కిల్‌లో...
ఈపీడీసీఎల్ సిబ్బంది బాధ్యతారాహిత్యం
11 సర్కిళ్ల పరిధిలో 37,749 విద్యుత్ కనెక్షన్లకు తప్పుగా ఆధార్ సీడింగ్
ఒకే ఆధార్‌తో 500 ఇళ్లకు అనుసంధానం
విశాఖ సర్కిల్ పరిధిలోనే అత్యధికంగా 4,012 కేసులు
విద్యుత్ వినియోగదారులసమస్యల పరిష్కార వేదికలో బహిర్గతం
తప్పులు సరిచేశాక నివేదిక ఇవ్వాలని ఆదేశాలు
ఏపీఈపీడీసీఎల్ డేటాబేస్‌లో వివిధ కారణాల వల్ల కొన్ని విద్యుత్ సర్వీస్‌ల ఆధార్ సీడింగ్‌లో తప్పులు దొర్లాయి. ఆధార్ సీడింగ్ తప్పుగా జరగడం వల్ల చాలా మంది అర్హులు ప్రభుత్వ పథకాలను దక్కించుకోలేకపోయారు. నష్టపోయిన విద్యుత్ వినియోగదారులు సీజీఆర్‌ఎఫ్‌ను ఆశ్రయించి నష్టపరిహారం, న్యాయం పొందవచ్చు. ప్రతి ఒక్కరూ గోప్యత హక్కు కూడా కలిగి ఉన్న నేపథ్యంలో వినియోగదారుల అనుమతి, సంతకం లేదా వేలి ముద్ర తప్పనిసరిగా తీసుకుని ఆధార్ నెంబర్‌ను విద్యుత్ సర్వీస్ కనక్షన్‌కు అనుసంధానం చేయాలి. తప్పులు సరిచేయాలని ఆదేశించాం. సరిచేసిన తర్వాత నివేదికలు ఇవ్వాలని ఈపీడీసీఎల్ అధికారులకు స్పష్టం చేశాం.
బి.సత్యనారాయణ, విశ్రాంత జడ్జి, సీజీఆర్‌ఎఫ్ చైర్మన్
బాధిత వినియోగదారులకు పరిహారం ఇవ్వాలి
ఆధార్ సీడింగ్ తప్పిదాలను రియల్ టైమ్ సాంకేతికతతో సరిచేయాలి. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఆధార్ సీడింగ్ సమాచారం ఎప్పటికపుడు అప్‌డేట్ కావడం లేదు. ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలి. ఆధార్ సీడింగ్ వల్ల నష్టపోయిన వినియోగదారులకు పరిహారం ఇవ్వాలి. ఇప్పటికే సీజీ నెం. 235/2024 కేసులో బాధితులకు నష్టపరిహారం మంజూరైంది. ఆధార్ అనుసంధానంలో పారదర్శకత తప్పనిసరిగా ఉండాలి. సీజీఆర్‌ఎఫ్ తీర్పు బాధ్యతరాహిత్యం.. నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులు, సిబ్బందికి చెంపపెట్టులాంటిది.
–కాండ్రేగుల వెంకటరమణ, కన్సూమర్ ఆర్గనైజేషన్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు

కరెంటోళ్ల నిర్లక్ష్యం!

కరెంటోళ్ల నిర్లక్ష్యం!