డాబాగార్డెన్స్: విశాఖ దక్షిణ నియోజకవర్గంలోని జాలరిపేటలో దేవి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో అపశ్రుతి చోటుచేసుకుంది. వేడి గంజి పడిన ఘటనలో చిన్నారులు, వృద్ధులు సహా 20 మంది గాయపడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. జాలరిపేట పిల్లా అప్పయ్యమ్మ కాలనీలో వీర్రాజు శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. శనివారం సాయంత్రం అమ్మవారి నిమజ్జనం నేపథ్యంలో మధ్యాహ్నం అన్నసమారాధన ఏర్పాటు చేశారు. కార్యక్రమం ఇరుకై న ప్రదేశంలో జరగడం, భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో అక్కడ గందరగోళ వాతావరణం నెలకొంది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని.. నిర్వాహకులు అదనంగా అన్నం వండటానికి గ్యాస్ స్టవ్‌పై పెద్ద పాత్రలో నీటిని మరిగించి బియ్యం వేశారు. అయితే స్టవ్ స్టాండు సరిగ్గా లేకపోవడంతో మరుగుతున్న నీటితో(ఎసరు) ఉన్న ఆ పాత్ర ఒరిగిపోయింది. అన్న ప్రసాదం కోసం క్యూలో ఉన్న చిన్నారులు, మహిళలు, వృద్ధుల కాళ్లపై గంజి నీళ్లు పడి గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు.. క్షతగాత్రులను హుటాహుటిన కేజీహెచ్‌కు తరలించారు. వీరిలో 18 మందికి స్వల్ప గాయాలు (2–3 శాతం కాలిన గాయాలు) కావడంతో.. ప్రథమ చికిత్స అందించి, మందులు ఇచ్చి డిశ్చార్జ్ చేశారు. అయితే.. పి.నక్షత్రలహరి (5), పి. ధనుష్(8) అనే ఇద్దరు చిన్నారులకు 20 శాతం కాలిన గాయాలవడంతో వారిని ప్లాస్టిక్ సర్జరీ వార్డులో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారెవరికీ ప్రాణాపాయం లేదని కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఐ.వాణి, ప్లాస్టిక్ సర్జరీ విభాగాధిపతి డాక్టర్ మోహన్‌రావు తెలిపారు.
కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులు
అన్నదానంలో అపశ్రుతి
అన్నదానంలో అపశ్రుతి
అన్నదానంలో అపశ్రుతి