
గాలుల బీభత్సానికి జూ విలవిల
ఆరిలోవ: విజయదశమి రోజున కురిసిన భారీ వర్షం, ఈదురుగాలులు ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. ఆ రోజు ఉదయం సంభవించిన ఈదురుగాలుల బీభత్సానికి జూలోని వందకు పైగా వృక్షాలు నేలకొరిగాయి. దశాబ్దాల నాటి సిరిసిం, టేకు, కానుగ, వేప వంటి భారీ వృక్షాలు సైతం వేళ్లతో సహా పెకిలించుకుపోయాయి. ఈ గాలుల ఉధృతికి పులుల ఎన్‌క్లోజర్ నుంచి పాముల జోన్ వరకు ఉన్న ప్రాంతంలో చెట్లు ఎక్కువగా దెబ్బతిన్నాయి. సింహాలు, కణుజులు, ఎలుగుబంట్లు ఉండే ఎన్‌క్లోజర్‌లతో పాటు, సీతాకోకచిలుకల పార్క్, క్యాంటీన్ పరిసరాల్లోని పచ్చదనం కూడా భారీగా దెబ్బతింది. కొన్ని చెట్లు మధ్యలో విరిగిపోగా, మరికొన్ని వేళ్లతో సహా కూలిపోయాయి. వృక్షాలు కూలడంతో సందర్శకుల మార్గాలు, జంతువుల ఎన్‌క్లోజర్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. రంగంలోకి దిగిన జూ సిబ్బంది.. ముందుగా సందర్శకుల రాకపోకలకు అడ్డంగా ఉన్న చెట్లను యుద్ధప్రాతిపదికన తొలగించి, మార్గాన్ని సుగమం చేశారు. ఎన్‌క్లోజర్‌లలో కూలిన చెట్లను తొలగించే పనుల్లో నిమగ్నమయ్యారు. ముఖ్యంగా సింహాల ఎన్‌క్లోజర్‌లో భారీ టేకు, సిరిసిం చెట్లు కూలిపోవడంతో, వాటి భద్రత దృష్ట్యా రెండు రోజులుగా సింహాలను సందర్శనకు అనుమతించడం లేదు. ఎన్‌క్లోజర్‌ను శుభ్రపరిచే పనులు పూర్తయ్యాక తిరిగి సింహాలను అనుమతిస్తామని జూ అధికారులు తెలిపారు. అదేవిధంగా.. పిల్లల ఆట స్థలంలోని పరికరాలపై చెట్లు విరిగిపడటంతో, ఆ ప్రాంతాన్ని తాత్కాలికంగా మూసివేశారు.

గాలుల బీభత్సానికి జూ విలవిల