
పాతికేళ్ల నృత్య పండగ
మద్దిలపాలెం: నటరాజ్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ 25వ వార్షికోత్సవం శనివారం కళాభారతి ఆడిటోరియంలో వైభవంగా జరిగింది. వేడుకల్లో భాగంగా అకాడమీ విద్యార్థులు ప్రదర్శించిన నృత్య, సంగీత ప్రదర్శనలు భారతీయ సంస్కృతీ వైభవాన్ని కళ్లకు కట్టాయి. వారి అద్భుత ప్రదర్శనలతో ప్రేక్షకులు మంత్రముగ్ధులయ్యారు. ముందుగా విశ్రాంత ఇన్‌కం ట్యాక్స్ కమిషనర్ సదగాని రవిశంకర్ నారాయణ్, అకాడమీ వ్యవస్థాపకుడు బత్తిన విక్రమ్‌కుమార్ గౌడ్, ప్రిన్సిపాల్ కె.వి.లక్ష్మి జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా విక్రమ్‌గౌడ్ మాట్లాడుతూ.. గడిచిన 25 ఏళ్లలో ఎందరో విద్యార్థులను తీర్చిదిద్దామని తెలిపారు. వీరిలో చాలామంది నేడు ప్రఖ్యాత కళాకారులుగా, గురువులుగా స్థిరపడటం తమకు గర్వకారణమన్నారు. అకాడమీ కళాకారులు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో ప్రదర్శనలిచ్చి బహుమతులు, ప్రశంసలు అందుకుందని వివరించారు. అనంతరం గురువుల మార్గదర్శకత్వంలో విద్యార్థులు ప్రదర్శించిన కూచిపూడి నృత్యాలు ఆహూతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా అకాడమీ ప్రిన్సిపాల్, నాట్యాచారిణి కె.వి.లక్ష్మిని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఘనంగా సత్కరించారు. పాతికేళ్ల విజయవంతమైన ప్రస్థానాన్ని గుర్తు చేసుకుంటూ, భవిష్యత్తులో మరింత మంది విద్యార్థులను కళల వైపు ప్రోత్సహించడమే తమ లక్ష్యమని లక్ష్మి పేర్కొన్నారు.
అబ్బురపరిచిన నటరాజ్ విద్యార్థుల నృత్యాలు

పాతికేళ్ల నృత్య పండగ