ముగ్గురికి తీవ్రగాయాలు
తగరపువలస: వలందపేట రెడ్డివీధిలో అమ్మవారి మండపం వద్ద బాణసంచా తయారీలో భాగంగా శుక్రవారం రాత్రి మంటలు వ్యాపించి అదే గ్రామానికి చెందిన బాకి మహేష్‌రెడ్డి(35), నగిరెడ్ల వాసు(32), చిల్ల కనకరెడ్డి(26) తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. దసరా ఉత్సవాల్లో భాగంగా గ్రామంలో మండపం నిర్మించి అమ్మవారి విగ్రహం ఏర్పాటు చేశారు. శనివారం అమ్మవారి నిమజ్జనోత్సవం నిర్వహించేందుకు ఉత్సవ కమిటీ ముమ్మరంగా ఏర్పాట్లు చేసుకుంటోంది. అందులో భాగంగా రూ.18 వేల విలువైన బాణసంచా కొనుగోలు చేశారు. ఇంకా బాణసంచా అవసరమని సొంతంగా తయారు చేసుకోవడానికి శుక్రవారం సాయంత్రం ఉపక్రమించారు. అందులో భాగంగా బాణసంచా తయారీకి అవసరమైన పొటాషియం తదితర ముడిపదార్థాలను బీరు సీసాతో నూరే క్రమంలో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించి ఈ ముగ్గురు గాయపడ్డారు. వీరిని తక్షణం సంగివలస అనిల్ నీరుకొండ ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కనకరెడ్డికి శస్త్రచికిత్స చేయగా మహేష్‌రెడ్డి, వాసులకు సోమవారం శస్త్రచికిత్స చేయనున్నారు. ఈ ముగ్గురు స్థానికంగా ప్లంబింగ్, ఎలక్ట్రీషియన్ పనులు చేస్తూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. వీరిలో మహేష్‌రెడ్డి, వాసులకు వివాహాలు కాగా కనకరెడ్డికి ఇంకా వివాహం కాలేదు. సంఘటనా స్థలాన్ని భీమిలి సీఐ తిరుపతిరావు, తాళ్లవలస అగ్నిమాపకశాఖాధికారి జి.శ్రీనివాసరాజు సందర్శించారు.
బాకి మహేష్‌రెడ్డి
నగిరెడ్ల వాసు
చిల్ల కనకరెడ్డి
బాణసంచా తయారీలో ప్రమాదం
బాణసంచా తయారీలో ప్రమాదం