
‘ఆటో డ్రైవర్ల సేవలో’ ప్రారంభం
బీచ్‌రోడ్డు: ‘ఆటో డ్రైవర్ల సేవలో’ కార్యక్రమం కింద జిల్లాలో 22,955 మంది ఆటో, మ్యాక్సీ, క్యాబ్ డ్రైవర్లకు రూ.34.43 కోట్ల లబ్ధి చేకూరిందని జిల్లా ఇన్‌చార్జి మంత్రి డా.డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి వెల్లడించారు. సిరిపురంలోని వీఎంఆర్డీఏ బాలల ప్రాంగణంలో ‘ఆటో డ్రైవర్ల సేవలో’ కార్యక్రమాన్ని శనివారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఈ పథకం కింద ప్రతి ఆటోడ్రైవర్‌కు ఏడాదికి రూ.15 వేలు చొప్పున అందిస్తామన్నారు. భీమిలి నియోజకవర్గంలో 5,892 మందికి, విశాఖ తూర్పులో 3,457, పశ్చిమలో 2,212, విశాఖ దక్షిణలో 2,358, ఉత్తరలో 2,563, గాజువాకలో 3,283, పెందుర్తిలో 3,190 మంది డ్రైవర్లకు ఈ పథకం కింద లబ్ధి చేకూరిందన్నారు. అర్హత ఉండి కూడా ఈ పథకం వర్తించని వారు సచివాలయం ద్వారా అధికారుల దృష్టికి తీసుకురావాలని మంత్రి సూచించారు. ఎమ్యెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు, కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు, పలువురు కార్పొరేటర్లు, బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ ప్రసాద్, డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ శ్రీనివాసరావు పాల్గొన్నారు.