
రమేష్ చేతికి గాయం
మహారాణిపేట: దీపావళి సందర్భంగా బాణసంచా కాలుస్తూ పలువురు గాయపడ్డారు. ఆదివారం రాత్రి, సోమ వారం కేజీహెచ్ బర్న్ వార్డులో గాయపడ్డ ఎనిమిది మందికి కేజీహెచ్ ప్లాస్టిక్ సర్జీరీ విభాగాధిపతి డాక్టర్ టి.మోహనరావు ఆధ్వర్యంలో అత్యవసర వైద్య చికిత్సలు చేశారు. వీరిలో కొందరికి శస్త్ర చికిత్సలు కూడా చేశారు. ప్రస్తుతం వీరి ఆరోగ్యం నిలకడగా ఉందని ప్లాస్టిక్ డాక్టర్ మోహనరావు చెప్పారు. బాంబు పేలుస్తుండగా కాగితాల కోవిందరెడ్డి ఛాతి భాగంలో కాలిపోయింది. 30 శాతం గాయపడ్డ గోవింద రెడ్డికి శస్త్ర చికిత్సలు అందించారు. తాళ్లవలస పోలమ్మ 40 శాతం మేర గాయపడింది. బాణసంచా పేలుడు వల్ల బండారు రమేష్ నాయుడు ఎడమ చేతికి, పప్పల దుర్గా ప్రసాద్, కర్రి దుర్గారావుకు కుడిచేతికి గాయమైంది. బద్దిక సురేష్‌కు కుడిచేతి వేళ్లు పూర్తిగా కట్ అయ్యాయి. దీపాలు వెలిగిస్తుండగా జె.మహాలక్ష్మికి చీర అంటుకుంది. ఈమె కూడా గాయపడింది. సోమాల చైతన్య దొర క్రాకర్ బ్లాస్టింగ్ గాయమైంది.