
విశాఖపట్నం: మద్దిలపాలెం పిఠాపురం కాలనీలో ఇద్దరి యువకుల మధ్య జరిగిన ఘర్షణ ఒకరి ప్రాణం తీసింది. అప్పటి వరకు కలిసి అష్టాచమ్మ ఆడిన ఆ యువకులు ఆట లో తలెత్తిన చిన్నపాటి వివాదంతో పరస్పరం దాడికి దిగారు. దీంతో నారాయణరావు (28) అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై ఎంవీపీ సీఐ మల్లేశ్వరరావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గవరవీధి, ఆటోమోటివ్ ప్రాంతానికి చెందిన దవిల నారాయణరావు (28), మద్దిలపాలెం పిఠాపురం కాలనీకి చెందిన ఆర్.రాంబాబు (29) ఇద్దరూ స్నేహితులు.
వివాహితుడైన రాంబాబు కారు డ్రైవర్‌గా పనిచేస్తుండగా అవివాహితుడైన నారాయణరావు పెయింటింగ్ పనులు చేస్తున్నాడు. మంగళవారం మధ్యాహ్నం వీరిద్దరూ పిఠాపురం కాలనీ మార్కెట్ సెంటర్ సమీపంలో బెట్టింగ్‌కు అష్టాచమ్మా ఆడారు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య గొడవ చోటుచేసుకుంది. అష్టాచమ్మా పిక్కలను నారాయణరావు తన్నేయడంతో కోపానికి గురైన రాంబాబు అతని మోహంపై బలంగా కొట్టాడు.
దీంతో వెనక్కిపడిపోయిన నారాయణరావుకు అక్కడి సిమెంట్ అరుగు తల వెనుక బలంగా తగలడంతో మరణించినట్లు సీఐ మల్లేశ్వరరావు వెల్లడించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. నిందితుడు రాంబాబు కోసం పోలీసులు గాలిస్తున్నారు.