
కరాసాలో దొంగల బీభత్సం
ఒకే రాత్రి 5 ఇళ్లలో చోరీ
గోపాలపట్నం: కరాసాలో దొంగలు బీభత్సం సృష్టించారు. బుధవారం రాత్రి ఐదు ఇళ్లలో చోరీకి పాల్పడి స్థానికులను భయాందోళనలకు గురి చేశారు. తాళాలు వేసి ఉన్న ఇళ్లలో వరుసగా దొంగతనాలు జరిగాయి. జీవీఎంసీ 52వ వార్డు కరాసాలో ప్రియాంక కాలనీలోని ఏసుబాబు, దేవి సప్లయర్స్ శ్రీను, రామాలయం వీధిలోని అభీష్, దుంపంవారి వీధిలోని పద్మ, బేరివారి వీధిలోని శ్రీను ఇళ్లలో చోరీ జరిగిందని స్థానికులు తెలిపారు. అయితే నాలుగు ఇళ్లలో చోరీ జరిగినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ నాలుగు ఇళ్లలో సుమారు 11 తులాల బంగారం, 20 తులాల వెండి, రూ.15వేల నగదు పోయినట్లు పోలీసులు తెలిపారు. ఈ సమాచారంతో డీసీపీ లతా మాధురి, వెస్ట్ సబ్‌డివిజన్ సీఐ నిమ్మకాయల శ్రీనివాసరావు, సీసీఎస్ సీఐలు కె.రామారావు, చంద్రశేఖర్, ఎస్‌ఐలు ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. పరిసర ప్రాంతాలను పరిశీలించారు. డాగ్ స్క్వాడ్‌ను రప్పించారు. క్లూస్ టీం ద్వారా వేలిముద్రలు సేకరించారు. దొంగల ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు డీసీపీ తెలిపారు.