
గొర్రెల మందపైకి దూసుకొచ్చిన ట్రాలర్
35 గొర్రెలు, 5 పిల్లలు మృతి
తగరపువలస : ఆనందపురం మండలం శొంఠ్యాం పంచాయతీ మిందివానిపాలెం జాతీయ రహదారిపై గొర్రెల మందపైకి ట్రాలర్ దూసుకొచ్చిన సంఘటనలో 35 గొర్రెలు, 5 పిల్లలు మృతి చెందగా.. మరో 10 వరకు తీవ్రంగా గాయపడ్డాయి. ఇదే మండలం పేకేరు పంచాయతీకి చెందిన దివ్యాంగుడు చందక సూర్యనారాయణ, ఆయన సోదరుడు వీరుబాబు మూడు రోజుల కిందట గొర్రెల మందతో వచ్చి మిందివానిపాలెం వీతం కళాశాల ప్రాంతంలో ఉంటున్నారు. స్థానిక రైతుల వ్యవసాయ భూముల్లో మంద ఆయ వేస్తున్నారు. సర్వీస్‌రోడ్డు నుంచి గొర్రెలను జాతీయ రహదారి దాటిస్తుండగా పెందుర్తి వైపు నుంచి ఆనందపురం వైపు ద్విచక్రవాహనాల లోడుతో వేగంగా వస్తున్న ట్రాలర్ అదుపులోకి రాకపోవడంతో మందపైకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో సూర్యనారాయణ రోడ్డుపై పడిపోయి స్వల్పంగా గాయపడ్డాడు. ఈ ప్రమాదం కారణంగా వారికి రూ.6 లక్షల వరకు నష్టం వాటిల్లింది. ఆనందపురం ట్రాఫిక్ ఎస్‌ఐ పాపారావు, ఆర్‌ఎస్ మొబైల్ సిబ్బంది ప్రమాద స్థలానికి చేరుకున్నారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని గొర్రెల రైతులు కోరుతున్నారు.