
దివ్యాంగుల పింఛన్లు రద్దు చేయొద్దు
జెడ్పీటీసీ సభ్యుల అసంతృప్తి
మహారాణిపేట: దివ్యాంగుల పింఛన్ల రీ వెరిఫికేషన్ చేసినప్పటికీ.. అర్హులైన వారందరికీ పింఛన్లు కొనసాగించాలని జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ జె.సుభద్ర సూచించారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో బుధవారం ఆమె అధ్యక్షతన పలు స్థాయీ సంఘాల సమావేశాలు జరిగాయి. ఈ సందర్భంగా పలువురు జెడ్పీటీసీ సభ్యులు మాట్లాడుతూ 40 శాతం లోపు వైకల్యం ఉందంటూ దివ్యాంగులకు నోటీసులు ఇచ్చి, సదరం సర్టిఫికెట్లను మళ్లీ వెరిఫికేషన్ చేస్తుండటంతో వారు ఆందోళన చెందుతున్నారన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి దివ్యాంగుల పింఛన్ల విషయంలో పలు రకాలుగా వేధిస్తున్నారని, దీని వల్ల వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. దీనిపై స్పందించిన చైర్‌పర్సన్.. దివ్యాంగుల పింఛన్లను రద్దు చేయవద్దన్నారు. ఉద్యోగులు నిబద్ధతతో పనిచేయాలని, పంచాయతీల్లో ఆదాయం పెంచేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కాగా.. అనకాపల్లి జిల్లా, పరవాడ మండలంలోని పంచాయతీరాజ్ అధికారుల పనితీరుపై జెడ్పీటీసీ సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు.
జేఈపై చర్యలు తీసుకోవాలి
పరవాడలో ఇప్పటికే సీసీ రోడ్లు ఉన్న చోట మళ్లీ కొత్త రోడ్ల కోసం ప్రతిపాదనలు చేయడం, వాటికి ఆమోదం తెలిపిన తర్వాత పనులు నిలుపుదల చేయడంపై పరవాడ జెడ్పీటీసీ సభ్యుడు పైలా సన్యాసిరాజు అభ్యంతరం తెలిపారు. ఈ విధంగా తప్పుడు ప్రతిపాదనలు చేసిన జేఈపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
ఆరోగ్యశ్రీ, కేజీహెచ్ సేవలపై చర్చ
కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఐ.వాణికి ఫోన్ చేస్తే స్పందించడం లేదని కె.కోటపాడు జెడ్పీటీసీ సభ్యురాలు ఈర్లె అనురాధ ఆరోపించారు. తాము సొంత పనుల కోసం ఫోన్ చేయమని, పేద రోగులకు వైద్యం కోసమే ఫోన్ చేస్తామని, అయినా అధికారి స్పందించకపోవడం దారుణమన్నారు. ఆరోగ్యశ్రీ పథకం సక్రమంగా అమలు కావడం లేదని, కార్పొరేట్ ఆస్పత్రుల్లో పేద రోగులకు వైద్య సేవలు అందేలా చూడాలని పలువురు జెడ్పీటీసీ సభ్యులు కోరారు. దీనిపై విశాఖ జిల్లా ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ డాక్టర్ అప్పారావు స్పందిస్తూ.. ఆరోగ్యశ్రీ కింద 3,000కు పైగా ప్రొసీజర్లకు చికిత్స అందిస్తున్నామని, కార్డు ఉన్న వారందరికీ సేవలు అందుతున్నాయని తెలిపారు. కేజీహెచ్ సూపరింటెండెంట్ ఐ.వాణి మాట్లాడుతూ ఆసుపత్రిలో పూర్తి స్థాయి క్యాన్సర్ చికిత్స, గుండె ఆపరేషన్లు జరుగుతున్నాయని, వెంటిలేటర్లు కూడా అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
గిరిజన ప్రాంతాల్లో విద్య, వసతి సమస్యలు
అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడం లేదని అనంతగిరి జెడ్పీటీసీ సభ్యులు గంగరాజు ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో టీచర్ల కొరత తీవ్రంగా ఉందని, వెంటనే ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని సభ్యులు డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన విద్యాశాఖ అధికారులు.. త్వరలోనే ఉపాధ్యాయ నియామకాలు చేపడతామని హామీ ఇచ్చారు.
పీఎం–సూర్య ఘర్‌పై అవగాహన
విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం 1912 నంబర్‌కు ఫోన్ చేస్తే.. 4 గంటల్లోపు సమస్యను పరిష్కరిస్తామని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. పీఎం–సూర్య ఘర్ పథకం ద్వారా ప్రజలు విద్యుత్ బిల్లుల భారం నుంచి ఉపశమనం పొందవచ్చన్నారు. జెడ్పీ సీఈవో పి. నారాయణమూర్తి, మూడు జిల్లాల అధికారులు, జెడ్పీటీసీ సభ్యులు పాల్గొన్నారు.