మురళీనగర్: కూటమి ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు గడుస్తున్నా ఉపాధ్యాయుల సమస్యలపై ఎటువంటి స్పందన లేకపోవడంతో ఉపాధ్యాయులు పోరు బాట పట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు గురువారం నుంచి 17వ తేదీ వరకు నిరసన వారంగా పాటించాలని నిర్ణయించారు. ఈ మేరకు మురళీనగర్‌లోని ఏపీటీఎఫ్ జిల్లా కార్యాలయంలో పోరుబాట గోడ పత్రికను ఆ సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సీహెచ్ కరుణాకర్, టి.రామకృష్ణ, రాష్ట్ర కార్యదర్శి కొటా శ్రీను, వివిధ మండల శాఖల అధ్యక్ష, కార్యదర్శులతో కలిసి ఆవిష్కరించారు. 11న నల్లబాడ్జీలతో విధులకు హాజరు, 12న మండల కేంద్రాల్లో నిరసన, 13, 14 తేదీల్లో ప్రజాప్రతినిధులకు వినతి పత్రాల సమర్పణ, 15న పాత తాలూకా కేంద్రాల్లో నిరసన, 16న జిల్లా కేంద్రాల్లో నిరసన, 17న ముఖ్యమంత్రి, చీఫ్ సెక్రటరీలకు వాట్సాప్, ఈ–మెయిల్ ద్వారా వినతులు పంపించడం చేస్తామన్నారు.
ఉపాధ్యాయుల సమస్యలపై పోరు బాట