దిగుబడిపై వ్యాపారులదే పెత్తనం సిండికెట్‌గా మారి ధరల నియంత్రణ అన్నదాత శ్రమకు అందని ప్రతిఫలం జిల్లాలో 21,850 వేలమెట్రిక్ టన్నుల పత్తి సేకరణ
బషీరాబాద్: పత్తి రైతుకు కష్టమే మిగులుతోంది. సాగు కోసం చేసిన అప్పులు.. పెరిగిన పెట్టుబడులు.. తగ్గిన దిగుబడులు అన్నదాతను ఆర్థికంగా కుంగదీస్తున్నాయి. మరోవైపు మార్కెట్‌లో పత్తికి డిమాండ్ ఉన్నా ఆశించిన ధర రావడం లేదు. కొనుగోళ్లలో పోటీ పెంచాల్సిన జిన్నింగ్ మిల్లుల యాజమాన్యాలే సిండికెట్‌గా మారి ధరలను శాసిస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫలితంగా రైతు శ్రమకు తగిన ప్రతిఫలం దక్కకపోగా.. వ్యాపారులకే లాభాల పంట పండుతోంది. ప్రతి కూల వాతావరణంలోనూ ఆరుగాలం కష్టపడి పండించిన రైతు చివరకు చిత్తవుతున్నాడు.
మిల్లులదే పేచేయి
జిల్లాలో ప్రైవేటు పత్తి కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటి వరకు 21,850 మెట్రిక్ టన్నులు సేకరించారు. ప్రాంతాల వారీగా చూస్తే తాండూరు లో అత్యధికంగా 9,194 మెట్రిక్ టన్నులు, కొడంగల్‌లో 5,989, ధారూరులో 2,153, వికారాబాద్‌లో 1,626, కోటిపల్లిలో 1,442, పరిగిలో 1,039, మర్పల్లిలో 404 మెట్రిక్ టన్నులు సేకరించారు. ఇతర రాష్ట్రాల నుంచి పత్తి రాకపోయినా స్థానికంగాకొనుగోళ్లు కొనసాగుతున్నాయి.అయితే అన్ని కొను గోళ్లు జిన్నింగ్ మిల్లుల వద్దే జరగడం ప్రైవేటువ్యాపారుల ఆధిపత్యాన్ని స్పష్టం చేస్తోంది. దీనికి తోడు నగదు చెల్లింపుల్లోనూ దర్జాగా ఒక శాతం కోత పెడుతున్నా మార్కెటింగ్ శాఖ అధికారులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరించడం అనుమానాలకు తావిస్తోంది.
ధరల్లో వ్యత్యాసం
పత్తి ధరలు ప్రాంతాన్ని బట్టి మారుతున్నాయి. కోటిపల్లిలో క్వింటాలుకు అత్యధికంగా రూ.9,250 పలకగా.. తాండూరులో రూ.9,110, కొడంగల్‌లో రూ.9,101, పరిగి, ధారూరులో రూ.9,100, వికా రాబాద్‌లో రూ.9,050, మర్పల్లిలోరూ.8,900 చెల్లించారు. పొడవు పింజ రకం పత్తికి రూ.8,667, మధ్య పింజ రకానికి రూ.8,267 కనీస మద్దతు ధరగా ఉంది. ప్రస్తుతం లభిస్తున్న ధరలు మద్దతు ధర కంటే ఎక్కువగా ఉన్నా.. నాణ్యత, ప్రాంతాన్ని బట్టి వ్య త్యాసం ఉండటంతో రైతులకు ఆశించిన స్థాయి లో ఆదాయం రావడం లేదనే అభిప్రాయాలున్నాయి.
పెట్టుబడుల భారం
జిల్లాలో ఈ ఏడాది 2,01,545 ఎకరాల్లో పత్తి సాగు చేశారు. 1,77,329 మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. అయితే విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, కూలీల ఖర్చులు పెరగడంతో సాగు భారంగా మారింది. కొన్ని ప్రాంతాల్లో దిగుబడులు తగ్గడం రైతుల ఆదాయంపై ప్రభావం చూపుతోంది. కొనుగోళ్లలో మరింత పోటీ పెంచి, మిల్లుల గుత్తాధిపత్యానికి అడ్డుకట్ట వేయాలని రైతులు కోరుతున్నారు. పత్తి నాణ్యతకు తగిన ధరతోపాటు మార్కెట్‌లో పారదర్శక కొనుగోళ్లు జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.


