తాండూరు రూరల్: ప్రజలు అంగీకరిస్తేనే లేటరైట్ తవ్వకాలకు ప్రభుత్వం అనుమతి ఇస్తుందని అడిషనల్ కలెక్టర్ వెంకటాచారి అన్నారు. బుధవారం పెద్దేముల్ మండలం పాషాపూర్ శివారులో లేటరైట్ తవ్వకాలపై తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఆ శాఖ ఈఈ రాజనర్స్, పర్యావరణ పరిరక్షణ సమితి ప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామానికి చెందిన రైతు కవిభాయ్‌కు చెందిన నాలుగు ఎకరాల ఐదు గుంటల భూమిలో లేటరైట్ తవ్వకాలకు ఓ కంపెనీ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుందన్నారు. ప్రజల అభిప్రాయాలను కలెక్టర్‌కు నివేదిస్తామన్నారు. ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు ఇవ్వాలా వద్దా అనే విషయం ఎస్‌ఈఐఏఏ సిఫారసు చేస్తుందనిపేర్కొన్నారు. ఒకవేళ అనుమతి వచ్చినా నిబంధనలు అతిక్రమిస్తే మైనింగ్‌ను రద్దు చేసే అధికారం కలెక్టర్‌కు ఉంటుందన్నారు.
గిరిజనులకు న్యాయం చేయాలి
ప్రజాభిప్రాయ సేకరణలో పాల్గొన్న పలువురు పర్యావరణ పరిరక్షణ ప్రతినిధులు జీడిమెట్ల రవీందర్, సత్యనారాయణ, దుండిగళ్ల అంజయ్య మాట్లాడుతూ.. గిరిజనుల భూముల్లో లేటరైట్ తవ్వకాల జరిపి దళారులు, కాంట్రాక్టర్లు సంపదను దోచుకుంటున్నారని ఆరోపించారు. లేటరైట్ తవ్వకాల ద్వారా వచ్చే డీఎంఎఫ్‌టీ నిధులు గిరిజన తండాల అభివృద్ధికే ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ వెంకట్ ప్రసాద్, రూరల్ సీఐ చంద్రశేఖర్, ఆర్‌ఐ శేఖర్, ఆయా గ్రామాల సర్పంచులు, మాజీ సర్పంచులు, నాయకులు పాల్గొన్నారు.


