అనుమతులు, ఈఐఎఫ్
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ‘అక్రమ మైనింగ్‌పై ఉక్కుపాదం మోపుతున్నాం. క్వారీల్లో తవ్వకాలు, క్రషర్లపై నిఘా పెట్టాం. అనుమతులకు భిన్నంగా చేపట్టిన తవ్వకాలను గుర్తించి, లీజుదారులకు పెనాల్టీలు వేస్తున్నాం. కరెంట్ యూనిట్ల వినియోగం ఆధారంగా క్రషర్ల నుంచి రాయల్టీ వసూలు చేస్తున్నాం. మైనింగ్ ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని మరింత పెంచాం’ అని జిల్లా గనులు, భూగర్భ వనరుల శాఖ ఏడీ మందాడి నర్సిరెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు శ్రీసాక్షిశ్రీ ప్రతినిధికి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. జిల్లాలో 44 పెద్ద, 66 చిన్న తరహా క్వారీ లీజులు మంజూరు చేశాం. మెజార్టీ క్వారీలు బండరావిర్యాల, కొందుర్గు, కొత్తూరు, ఆమనగల్లు పరిధిలో ఉన్నాయి. వీటిలో స్టోన్, మెటల్, లాటరైట్, క్వార్ట్జ్, గ్రానైట్ క్వారీలు ఉన్నాయి. వీటి నుంచి 2025 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వానికి రూ.301 కోట్ల ఆదాయం సమకూరగా, ఈ ఏడాది రూ.372 కోట్లు సాధించిపెట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇప్పటికే రూ.154 కోట్లు వసూలు చేశాం. జిల్లాలో యాభైకిపైగా క్రషర్లు పని చేస్తున్నాయి. విద్యుత్ యూనిట్ ఆధారంగా వాటి నుంచి రెవెన్యూ వసూలు చేస్తున్నాం. ఒక యూనిట్ విద్యుత్‌కు ఒక మెట్రిక్ టన్ను చొప్పున లెక్కించి, ఆ మేరకు రాయాల్టీ వసూలు చేస్తున్నాం.
ఫ్యూచర్ సిటీలో తవ్వకాలపై ఆంక్షలు
ఫ్యూచర్‌సిటీని కాలుష్య రహితంగా(నెట్ జీరో సిటీగా) తీర్చిదిద్దాలని ప్రభుత్వం భావిస్తోంది. ఎఫ్‌సీడీఏ పరిధిలోని 8 జీపీలు(873 చదరపు కిలోమీటర్ల) మా అనుమతి లేకుండా లీజులు, తవ్వకాలకు అనుమతులు ఇవ్వకూడదని ఎఫ్‌సీడీఏ, టీజీఐఐసీ ఆదేశాలు జారీ చేశాయి. ఇప్పటికే ఇక్కడ లీజులో కొనసాగుతున్న రెండు క్వారీల లైసెన్సులు రద్దు చేసి, ఎనిమిది క్రషర్ మిషన్లను మూసేశాం. తాజాగా రెండు క్వారీలను గుర్తించినప్పటికీ ఎఫ్‌సీడీఏ ఆదేశాలతో లీజు నోటిఫికేషన్ల నిలిపివేశాం. ఇక్కడ కంకర, రాయి, మట్టి తవ్వకాలకు అవకాశం ఉన్నప్పటికీ ఆంక్షల వల్ల అవకాశం లేకుండా పోయింది.
రేడియల్తో రూ.50 కోట్లు
రావిర్యాల ఎగ్జిట్ నుంచి ఆమనగల్లు వరకు 41 కిలోమీటర్ల మేర నిర్మించతలపెట్టిన రేడియల్ రోడ్డుకు మట్టి, కంకర, రాయి భారీగా అవసరం. 2028 మే నాటికి ఈ ప్రాజెక్టును పూర్తిచేయాలని ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే టెండర్లు పిలిచి, పనులు కూడా చేపట్టగా వేగంగా సాగుతున్నాయి. వంద మీటర్ల వెడల్పుతో కూడిన ఈ రహదారికి 10 లక్షల మెట్రిక్ టన్నుల మట్టి, 20 లక్షల మెట్రిక్ టన్నుల కంకర, రాయి, రోబోసాండ్ కావాలని అంచనా. మార్గంలోని కొండలు, గుట్టలను తొలిస్తే వచ్చే మట్టి, కంకర, రాయితో ఎత్తుపల్లాలను సరి చేస్తున్నారు. ఇందుకు కాంట్రాక్ట్ సంస్థలు మైనింగ్ విభాగానికి రాయల్టీ చెల్లిస్తున్నాయి. ఇప్పటికే రూ.10 కోట్ల ఆదాయం సమకూరింది. రోడ్డు పూర్తయ్యే నాటికి రూ.50 కోట్ల ఆదాయం సమకూరుతుందని అంచనా.
మూడు చోట్ల కొత్త మైన్స్
చేవెళ్ల డివిజన్ అంతారం, హస్తేపూర్లో లేటరైట్ మైన్స్ లీజులో కొనసాగుతున్నాయి. కొత్తగా ముద్విన్, కడ్తాల్, షాద్‌నగర్ పరిసర ప్రాంతాల్లో మరికొన్ని మైన్స్‌ను గుర్తించాం. భవిష్యత్తులో ఇవి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. మంచాల మండలంలో కొన్ని క్వారీలు గుర్తించినప్పటికీ వీటికి రెవెన్యూ క్లియరెన్స్ రావాల్సి ఉంది. పొజిషన్లో అసైనీలు ఉన్నట్లు తెలిసింది. ఆమనగల్లు రెవెన్యూ సర్వే నంబర్ 304లోని 4.86 హెక్టార్ల విస్తీర్ణంలో మెటల్ స్టోన్ తవ్వకానికి రూ.4.90 కోట్లు చెల్లించి, లీజుకు తీసుకున్నారు.
భారీగా పెనాల్టీ వేస్తున్నాం
కొహెడ రెవెన్యూ సర్వే నంబర్ 167/2లో ఓ నిర్మాణ సంస్థ భారీగా తవ్వకాలు చేపట్టినట్లు గుర్తించి, రూ.9.5 కోట్ల పెనాల్టీ వేశాం. తట్టి అన్నారం సర్వే నంబర్ 121/పీలో తీసుకున్న అనుమతులు తీసుకున్న సంస్థకు రూ.3.39 కోట్ల జరిమానా వేశాం. సంఘీ సిటీలో 5.5 ఎకరాల గుట్టను తొలిచి రోబో సాండ్ విక్రయించగా 2012లోనే రూ.65.80 లక్షలు చెల్లించారు. మన్సూరాబాద్ సర్వే నంబర్ 38లోని ఓ నిర్మాణ సంస్థ ఏడెకరాల విస్తీర్ణంలో చేపట్టిన తవ్వకాలపై రూ.2 కోట్ల డిమాండ్ నోటీసులు సర్వ్ చేశాం. అయితే వీరంతా కోర్టులను ఆశ్రయిస్తున్నారు.
ఎఫ్‌సీడీఏ పరిధిలో తవ్వకాలపై ఆంక్షలు
రెండు మైన్స్‌ల లీజులు రద్దు.. నాలుగు క్రషర్ల మూసివేత
ముద్విన్, కడ్తాల్, షాద్‌నగర్‌లో కొత్తవి గుర్తింపు
మైనింగ్ ద్వారా రూ.372 కోట్ల ఆదాయం అంచనా
ప్రభుత్వ ఖాతాల్లోకి ఇప్పటికే రూ.154 కోట్ల జమ
‘సాక్షి’తో రంగారెడ్డి జిల్లా గనులు, భూగర్భ వనరుల శాఖ ఏడీ నర్సిరెడ్డి
అధికారిక తనిఖీలు, భారీ పెనాల్టీలకు భయపడి మెజార్టీ కన్స్ట్రక్షన్ కంపెనీలు ప్రస్తుతం సెల్లార్ సహా బహుళ అంతస్తుల నిర్మాణాలకు హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీల నుంచి అనుమతులు తీసుకుంటున్నాయి. ప్రభుత్వం నిర్దేశించిన ఎన్విరాన్మెంట్ ఇంఫాక్ట్ ఫీజు, బిల్డింగ్ ఫర్మిషన్ ఫీజు(ఈఐఎఫ్) చెల్లిస్తున్నాయి. సెల్లార్ తవ్వగా వచ్చిన మట్టిని బయటకు అమ్మితే టన్నుకు రూ.50 చొప్పున రాయాల్టీ వసూలు చేస్తున్నాం. ఎప్పటికప్పుడు లీజు ఆ దాయాన్ని ముదింపు చేసి ప్రభుత్వ ఆదాయానికి నష్టం వాటిళ్లకుండా జాగ్రత్త వహిస్తున్నాం అని ఏడీ నర్సిరెడ్డి స్పష్టం చేశారు.


