రైతుల గుండెల్లో గుబులు | - | Sakshi
Sakshi News home page

రైతుల గుండెల్లో గుబులు

Oct 7 2026 9:14 AM | Updated on Oct 7 2026 9:14 AM

కోతకు వచ్చే సమయానికి..

ఎలా బతకాలి?

● రేడియల్‌ రోడ్డుతో కలవరం

● భూములు, ఇళ్లు కోల్పోనున్న బాధితులు

● ఇంకా పూర్తి స్థాయిలో అందని పరిహారం

● ఆందోళనలో అన్నదాతలు

కొందుర్గు: ప్రభుత్వం నూతనంగా నిర్మించనున్న గ్రీన్‌ఫీల్డ్‌ రేడియల్‌ రోడ్డు–2 బాధితులకు ఇంకా పూర్తిస్థాయిలో పరిహారం అందకపోవడంతో ఆందోళనకు గురవుతున్నారు. బుద్వేల్‌ నుంచి నాచారం వరకు 75 మీటర్ల వెడల్పుతో 81 కిలోమీటర్ల పొడవు రూ.3,295 కోట్లతో నిర్మించనున్న రేడియల్‌ రోడ్డు కొందుర్గు మండలంలోని చుక్కమెట్టు, ముట్పూర్‌, ఉమ్మెంత్యాల లాలపేట జిల్లేడ్‌, చౌదరిగూడ మండలంలోని లచ్చంపేట మీదుగా వెళ్తుంది. చుక్కమెట్టులో 17 మంది రైతులకు సంబంధించి ఎ. 9. 31 గుంటలు, ముట్పూర్‌లో 136 మంది రైతులకు సంబంధించి ఎ. 93. 36 గుంటలు, ఉమ్మెంత్యాల లాలపేటకు చెందిన 52 మంది రైతులకు సంబంధించి ఎ. 36.27 గుంటల భూమి కోల్పోతున్నారు. ఇందుకు గాను ప్రభుత్వం ఎకరాకు రూ. 40 లక్షలు ఇవ్వడానికి రైతులతో ఒప్పందం చేసుకుంది. ఈ పరిహారం దాదాపు 90 శాతం రైతుల ఖాతాల్లో జమచేసినట్టు అధికారులు చెబుతున్నారు. ఉమ్మెంత్యాలకు సంబంధించి రైతులకు పరిహారం అందించారు. కొన్ని సాంకేతిక కారణాలతో ముట్పూర్‌లో 20 ఎకరాలు, చుక్కమెట్టులో 6 ఎకరాలకు పరిహారం అందాల్సి ఉందని తెలిపారు.

పూర్తికాని సర్వే

భూముల పరిహారం అటుంచితే రైతులు వారి పొలాల్లో నిర్మించిన పశువుల పాకలు, ఫామ్‌హౌస్‌లకు సంబంధించి ఇంకా అధికారులు సర్వే చేయలేదు. పొలాల్లో మామిడి, డ్రాగన్‌, నిమ్మ, కొబ్బరి, జామ, అరటి తదితర మొక్కలకు సంబంధించి ఉద్యానవన శాఖ అధికారులు సర్వే చేశారు. కానీ నేటికి తోటల డబ్బులు రైతులకు అందలేదు. ఓవైపు ప్రభుత్వం రేడియల్‌ రోడ్డు పనులు త్వరితగతిన పూర్తి చేయాలని చర్యలు తీసుకుంటున్నా, రైతులకు ఇంకా పూర్తిస్థాయి పరిహారం అందలేదు. పండ్ల తోటలతోపాటు పలువురు రైతులు లక్షలు ఖర్చుచేసి నిర్మించిన షెడ్‌లు, ఇళ్లు రేడియల్‌ రోడ్డులో కోల్పోతున్నారు. అధికారులు ఇంకా షెడ్‌లకు సంబంధించి సర్వేలు చేపట్టలేదు. పండ్ల తోటలకు సంబంధించి సర్వే చేసినప్పటికీ ఎలాంటి పరిహారం అందలేదు. దీంతో అన్నదాతలు ఆవేదనకు గురవుతున్నారు.

మూడు ఎకరాల్లో డ్రాగన్‌ఫ్రూట్‌ తోట కోసం రూ. 25 లక్షల పెట్టుబడి పెట్టాను. సరిగ్గా కోతకు వచ్చే సమయానికి రోడ్డు నిర్మాణంలో తోట పోయే పరిస్థితి దాపురించింది. తోటపాయే.. ఉన్న భూమి పాయే ఎలా బతకాలి.

– వడ్ల చంద్రశేఖర్‌, ఉమ్మెంత్యాల

ఏడాది క్రితమే రూ.30 లక్షలు ఖర్చుచేసి నిర్మించిన ఇల్లు రేడియల్‌ రోడ్డులో పోతోంది. రోడ్డు మార్కింగ్‌ ఇంటిపైనే పెట్టారు. బతుకుదెరువు కోసం సాగుచేసిన డ్రాగన్‌ తోట, భూమి, ఇల్లు మొత్తం పోతుంది. నేను, నా కుటుంబ సభ్యులు ఎట్లా బతకాలి.

– జంగారెడ్డి, ఉమ్మెంత్యాల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement