● సీఈసీ జ్ఞానేష్‌కుమార్‌ను విధుల నుంచి తొలగించాలి
● కలెక్టరేట్ ఎదుట అఖిలపక్ష నేతల ఆందోళన
ఇబ్రహీంపట్నం రూరల్: ఎస్‌ఐఆర్ పేరుతో కేంద్ర ఎన్నికల సంఘం ఓట్ల తొలగింపు సరికాదని, సీఈసీ జ్ఞానేష్‌కుమార్‌ను తొలగించాలని ఇండియా కూటమి ప్రతినిధులు డిమాండ్ చేశారు. కలెక్టరేట్ ఎదుట మంగళవారం కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం అడిషనల్ కలెక్టర్ డాక్టర్ కిరణ్మయికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ.. ఇప్పటికే తొలగించిన ఓటర్ల పేర్లను తిరిగి జాబితాలో చేర్చాలని, ఫారం–6 , ఫారం–7కు సంబంధించి వివాదాస్పద నిబంధనలు పునఃపరిశీలించాలని కోరారు. ప్రతి పౌరుడి ఓటు హక్కును కాపాడాలని, ఓటర్ల జాబితా రూపకల్పనలో పూర్తి పారదర్శకత ఉండాలని అన్నారు. ఓటర్ల డేటా కేంద్రీకరణను నిలిపివేసి, స్థానిక ఎన్నికల అధికారులకు ఓటర్ల జాబితాల నిర్వహణపై పూర్తి హక్కులు కల్పించాలని కోరారు. ఎన్నికల డేటాపై తటస్థ ఐటీ నిపుణులతో స్వతంత్ర ఆడిట్ నిర్వహించాలన్నారు. ఎన్నికల కమిషనర్ల నియామకంలో పారదర్శకత కోసం ప్రధాని, లోక్‌సభ ప్రతిపక్ష నేత, భారత ప్రధాన న్యాయమూర్తితో కూడిన ఎంపిక కమిటీ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. అప్పటి వరకు అఖిలపక్షం ఆధ్వర్యంలో ఉద్యమాన్ని కొనసాగిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షురాలు చిగురింత పారిజాత, ఎమ్మెల్యేలు మల్‌రెడ్డి రంగారెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, వీర్లపల్లి శంకర్, సీపీఎం జిల్లా కార్యదర్శి సామేలు, సీపీఐ కార్యదర్శి జంగయ్య, చేవెళ్ల కాంగ్రెస్ ఇన్‌చార్జి భీమ్‌భరత్ తదితరులు పాల్గొన్నారు.


