ఫార్మా రైతుల పోరుబాట! | - | Sakshi
Sakshi News home page

ఫార్మా రైతుల పోరుబాట!

Oct 7 2026 9:14 AM | Updated on Oct 7 2026 9:14 AM

తండాలనే లేకుండా చేస్తున్నారు

యాచారం: ఫార్మాసిటీ భూ బాధితులు న్యాయం కోసం ప్రత్యక్ష పోరుబాటకు సిద్ధమయ్యారు. గత బీఆర్‌ఎస్‌ సర్కార్‌ హయాంలో ఫార్మాసిటీ భూసేకరణ ప్రక్రియ వేగవంతంలో భాగంగా మండల పరిధిలోని నక్కర్తమేడిపల్లి, నానక్‌నగర్‌, తాడిపర్తి, కుర్మిద్ద గ్రామాల్లోని 2,200 ఎకరాలతో పాటు కోర్టు కేసుల్లో ఉన్న మరో 300 ఎకరాల పట్టా భూమిని సేకరించడానికి అధికారులు నిర్ణయించారు. ఏడాదికి మూడు పంటలు పండే వ్యవసాయ భూములు వదులుకోవడానికి నాలుగు గ్రామాల రైతులు ససేమిరా అన్నారు. దీంతో అధికారులు రాత్రికిరాత్రే అవార్డులు పాస్‌ చేసి రైతుల పేర్లపై ఉన్న భూ రికార్డులను టీజీఐఐసీ పేరు మీద మార్చేసి, పరిహారం డబ్బులను అథారిటీలో జమ చేశారు. దీంతో రైతులు బ్యాంకు రుణాలు, రైతు భరోసా, అత్యవసర పరిస్థితుల్లో అమ్ముకుందామన్నా వీలు లేక నష్టపోతున్నారు.

కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే..

ఫార్మాసిటీకి వ్యతిరేకంగా నాలుగు గ్రామాల రైతాంగానికి మద్దతుగా అప్పట్లో నేటి సీఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు అండగా నిలిచారు. అధికారంలోకి వస్తే ఫార్మాసిటీని రద్దు చేసి టీజీఐఐసీ పేరు మీద మార్చేసిన పట్టా భూముల భూ రికార్డులను మళ్లీ రైతుల పేర్లపై మార్చేస్తామని హామీలిచ్చారు. అధికారంలోకి వచ్చి మూడేళ్లు కావస్తున్నా పట్టించుకున్న పాపాన పోలేదు. ఫార్మాసిటీ భూ బాధిత రైతులకు పరిహారం పెంచి న్యాయం చేస్తామని ఓ మాట, ల్యాండ్‌ పూలింగ్‌ చేస్తామని మరో మాట ఇస్తూ దాట వేసే ధోరణితో వ్యవహరిస్తున్నారు. రెండేళ్ల కాలంలో మాటలతో మభ్యపెడుతూ సమస్యను పరిష్కరించకుండా సర్కార్‌ కాలయాపన చేస్తోందని రైతులు గ్రహించారు. టీజీఐఐసీ పేరు మీదున్న 2,200 ఎకరాల్లో కనీసం సగం తీసుకుని మిగితా సగం వదిలితే పుట్టిన ఊళ్లలో ఫ్యూచర్‌ను చూసుకుని జీవిస్తామని వేడుకున్నా ఫలితం లేకుండా పోయింది. దీంతో ప్రత్యక్ష పోరుబాటకు సిద్ధమవుతున్నారు. అందులో భాగంగానే తాజాగా ఇబ్రహీంపట్నం కేంద్రంలోని ప్రజాభవన్‌ను ముట్టడించి ఆందోళన, సాగర్‌ హైవేపై బైఠాయించి ధర్నా చేశారు. ఢిల్లీ పెద్దలకు తమ సమస్య అర్థమయ్యేలా జాతీయ ఎస్టీ కమిషన్‌ సభ్యుడైన జాటోత్‌ హుస్సెన్‌నాయక్‌కు కుర్మిద్ద తండా గిరిజన రైతులు తమ బాధలు చెప్పుకొన్నారు. సర్కార్‌ పెద్దలపై ఒత్తిళ్లు తీసుకురావడం కోసం పాదయాత్రలు, ప్రజాప్రతినిధుల ఇళ్లను ముట్టడించే ఆలోచనలో ఉన్నారు.

కాంగ్రెస్‌ పెద్దల నాన్చుడి ధోరణిపై ఆగ్రహం

న్యాయం కోసం ఆందోళనలకు సిద్ధం

పాదయాత్రలు, ప్రజాప్రతినిధుల ఇళ్ల ముట్టడికి ప్రణాళికలు

టీజీఐఐసీ పేరు మీద మార్చేసిన పట్టా భూములు

గ్రామం ఎకరాలు

నక్కర్తమేడిపల్లి 483.25

నానక్‌నగర్‌ 154.16

తాడిపర్తి 382.35

కుర్మిద్ది 974.06

మంగలిగడ్డ, మర్లకుంట, పోతుబండా తండాల గిరిజన రైతులకు చెందిన 1,850 ఎకరాల అసైన్డ్‌, పట్టా భూమిని ఫార్మాసిటీకి ఇచ్చేసాం. మిగిలింది కేవలం 200 ఎకరాల పట్టా భూమి మాత్రమే. ఆ భూమిని కూడా గిరిజనుల నుంచి సర్కార్‌ తీసుకోవాలని చూస్తోంది. ఆ భూమి పోతే ఇక తండాలే ఉండవు. ఐదేళ్లుగా పాలక ప్రభుత్వాలు, అధికారులు మభ్యపెడుతున్నారు. పోరుబాటతోనే న్యాయం జరుగుతుందని భావిస్తున్నాం. – నేనావత్‌ కిషన్‌నాయక్‌, రైతు, కుర్మిద్ద

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement