పరిగి: చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని న్యాయ సేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి రాధిక సూచించారు. మంగళవారం మండలంలోని మిట్టకోడూర్ పాఠశాలలో అంకిత స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో న్యాయ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పోక్సో చట్టం, గుడ్, బ్యాడ్ చట్‌పై బాలికలు, తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని సూచించారు. బాల్యవివాహాలు చేయడం చట్టవిరుద్ధమని ఎక్కడైనా జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. సైబర్ నేరాల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అవసరం మేరకే సెల్‌ఫోన్ వినియోగించాలని, అనవసర లింకులు ఓపెన్ చేయరాదన్నారు. విద్యార్థులను ఫోన్లకు దూరంగా ఉంచాలని సూచించారు. ఉచిత న్యాయ సేవలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. లేబర్ కార్డులు ఉన్న కార్మికులకు ప్రభుత్వ సంక్షేమాలు అందుతాయని, ప్రతి ఒక్కరూ కార్డులు పొందాలని అన్నారు. అనంతరం విద్యార్థులకు అంకిత స్వచ్ఛందసంస్థ ఆధ్వర్యంలో బ్యాగులు, మ్యాట్లు, చెప్పులు, భవన నిర్మాణ కార్మికులకు లేబర్ కార్డులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ మాణిక్యం, అంకిత స్వచ్ఛంద సంస్థ జిల్లా కోఆర్డినేటర్ ప్రకాశ్‌కుమార్, న్యాయవాదులు వెంకటేశ్, శ్రీనివాస్, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
న్యాయ సేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి రాధిక


